దలీమ్‌గా మారుతోన్న హలీం

3 Jun, 2019 16:59 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా: కార్మికులు, ఇతర వర్గాల ప్రజలతో ఎప్పుడూ రద్దీగా ఉండే కోల్‌కతా నగరంలోని ఓ రోడ్డులో ‘సైకా’ రెస్టారెంట్‌ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘బీఫ్‌ దలీమ్‌ 60 రూపాయలు, చికెన్‌ దలీమ్‌ 70, మటన్‌ దలీమ్‌ 110 రూపాయలకు ప్లేట్‌’  అని ఇక్కడ ఉన్న ప్రకటనను చూసిన మీడియా కూడా కించిత్తు ఆశ్చర్యానికి గురైంది. రెస్టారెంట్‌ లోపలికెళ్లి ‘దలీమ్‌’ అనే కొత్త వంటకాన్ని ప్రవేశపెట్టారా ? అని ప్రశ్నించగా, ‘కొత్తదేమీ కాదండీ, దలీమ్‌ అంటే పాత హలీమేనండీ’  అని యజమాని కుమారుడైన మొహమ్మద్‌ అస్గార్‌ అలీ తెలిపారు. అదేంటీ పేరెందుకు మార్చారంటూ మీడయా ప్రశ్నించగా, తామొక్కరే కాదని, నగరంలోని పలు మొఘల్‌ హోటళ్లు హలీమ్‌ పేరును దలీమ్‌గా మార్చివేశాయని, అందుకు సోషల్‌ మీడియానే కారణమని ఆయన తెలిపారు.

‘హలీమ్‌’లో అల్లా పేరు ధ్వనిస్తోందని, అలా అల్లా పేరుతో ఆహార వంటకం ఉండడం మంచిది కాదంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. హలీమ్‌ను దలీమ్‌గా మార్చడం కోల్‌కతాలోని కొన్ని హోటళ్లకే పరిమితం కాలేదు. దక్షిణాసియాలోని కొన్ని దేశాల్లో కూడా ఇలాగే పేరు మార్చారు. మార్చాలా, లేదా అన్న విషయమై పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ సోషల్‌ మీడియాలో విస్తతంగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 2017లో కూడా హైదరాబాద్‌ కేంద్రంగా హలీమ్‌ పేరు మార్చడంపై సోషల్‌ మీడియా చర్చను లేవదీసింది. ఎందుకోమరి, అది అంతటితోనే ఆగిపోయింది.

ఇక, దలీమ్‌ అని పేరే ఎందుకు పెట్టారని మీడియా ప్రశ్నించగా, దాల్‌తో తయారు చేస్తారు కనుక దలీమ్‌ అని నామకరణం చేసినట్లు అస్గార్‌ అలీ తెలిపారు. కీమాలో ఉపయోగించేది దాల్‌ కాదుకదా, గోధుమ గదా? అని ప్రశ్నించగా గోధుమ కూడా ఒకరకమైన దాలేనండంటూ సమాధానం ఇచ్చారు. కోల్‌కతాలో అనేక మొగులాయ్‌ రెస్టారెంట్ల చైన్‌ను కలిగిన హోటల్‌ ‘ఆర్సలన్‌’ మాత్రం హలీమ్‌ పేరును మార్చలేదు. ఇదే విషయమై ప్రశ్నించగా, ‘లాయర్‌ను ఉర్దూలో వకీల్‌ అని పిలుస్తాం. అల్లాకు మరో పేరు వకీల్‌. అంతమాత్రాన వకీల్‌ పేరు మారుస్తామా?’ అని హోటల్‌ నిర్వాహకుల్లో ఒకరైన మొహమ్మద్‌ గులామ్‌ ముస్తఫా వ్యాఖ్యానించారు. ‘రోజూ నమాజ్‌ చదవని వాళ్లు, ఖురాన్‌ గురించి తెలియని వాళ్లు, తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో సోషల్‌ మీడియాలో ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అవన్ని నమ్మితే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు.

అరేబియా నుంచి భారత్‌కు
హలీమ్‌ అనేది ప్రాచీన అరబ్‌ వంటకం. 8 శతాబ్దానికి చెందిన అబ్బాసిద్‌ కాలిఫత్‌ హయాంలో ఈ వంటకం చాలా ప్రసిద్ధి చెందినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ వంటకాన్ని ‘హరీసాహ్‌’ అని పిలిచేవారు. గోధుమ, మటన్‌ మిశ్రమాన్ని అరబ్‌లో అలా పలుకుతారట. అది భారత్‌కు వచ్చాక హలీమ్‌గా మారింది. పశ్చిమాసియా దేశాల్లో, ఇరానీలో ఈ వంటకం ఎంతో ప్రసిద్ధి. హలీమ్‌కు ప్రపంచ రాజధానిగా మన హైదరాబాద్‌ను పేర్కొంటారు.

మరిన్ని వార్తలు