పరస్పరం గౌరవించుకోవాలి

13 Jan, 2016 01:17 IST|Sakshi
పరస్పరం గౌరవించుకోవాలి

సంప్రదాయాలు, అభిప్రాయాలపై ప్రధాని
 
 రాయ్‌పూర్: ‘అసహనం’పై విస్తృత చర్చ నేపథ్యంలో శాంతి, ఐకమత్యం, సామరస్యాలకు పిలుపునిస్తూ.. పరస్పర సంప్రదాయాలు, అభిప్రాయాలను గౌరవించుకోవాలని ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. వివేకానంద జయంతిని సందర్భంగా రాయ్‌పూర్ జరుగుతున్న జాతీయ యువజనోత్సాన్ని ఉద్దేశించి మంగళవారం ప్రధాని  ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘మనది భిన్నత్వం గల దేశం. సామరస్యం మన బలం. మా ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం పని చేస్తోంది. సామరస్యంగా ఉండకపోతే ప్రగతి సాధించలేం. ఐకమత్యం, సామరస్యం లేకపోతే.. ఒకరి సంప్రదాయాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించకపోతే.. అభివృద్ధి మార్గంలో ఆటంకాలు కలగవచ్చు. శాంతి, ఐకమత్యం, సామరస్యం లేకపోతే సౌభాగ్యం, సంపద, ఉపాధి కల్పనలకు అర్థం ఉండదు.

మనం శాంతియుతంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాల్సిన సమయమిది. దేశ ప్రగతికి ఇవి హామీనిస్తాయి. వందలాది భాషలు, విభిన్న మతాలతో కూడిన భిన్నత్వ దేశం శాంతియుతంగా జీవించగలదని భారత్ ప్రపంచానికి చాటింది. ఈ సంస్కృతిని మనం దీనిని పరిరక్షించాల్సి ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని  ప్రస్తావిస్తూ మనిషి చేతులు ఏదో ఒకరంగంలో నైపుణ్యంతో బలోపేతం కావాలి కానీ, ఒకరిని చంపటానికి ఉపయోగపడవద్దని అన్నారు.

మరిన్ని వార్తలు