అమర జవాన్ల త్యాగనికి గుర్తుగా కేంద్రం మెమోంటో ఇవ్వాలి

19 Jun, 2020 19:20 IST|Sakshi

న్యూఢిల్లీ: గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది అనే వార్త తెలిసినప్పటి నుంచి రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ సీకే సూద్‌ స్థిమితంగా ఉండలేకపోతున్నారు. 20 మంది సైనికులు చనిపోయారని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత విలవిల్లాడిపోయారో.. సూద్‌ కూడా అలానే బాధపడ్డారు. ఈ ఘటన ఆయన కుమారుడిని గుర్తు చేసింది. సీకే సూద్‌ కుమారుడు మేజర్‌ అంజు సూద్‌ కూడా గత నెల 2న కశ్మీర్‌ హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న పౌరులను కాపాడే క్రమంలో అంజు సూద్‌ మరణించారు. ఈ ఘటనలో మొత్త ఐదుగురు చనిపోయారు. కొడుకు మరణించిన విషాదం నుంచి బయటపడక ముందే మరో 20 మంది సరిహద్దులో నెలకొరిగారనే విషయం ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!)

ఈ సందర్భంగా సీకే సూద్‌ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు మరణించాడనే వార్త నాకు ఒక రోజు తర్వాత తెలిసింది. ఆలోపే ఈ వార్త అన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది’ అన్నారు. రాజకీయ నాయకులు అమర జవాన్ల మృతికి సంతాపంగా ఓ ట్వీట్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారని.. ఆ తర్వాత వీరుల కుటుంబాలను పట్టించుకునే నాదుడు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. సీకే సూద్‌ గత నెల 30న Change.org అనే ఆన్‌లైన్‌ పిటీషన్‌ను‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీకే సూద్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మన హీరోల త్యాగాన్ని ఎలా గుర్తిస్తుందో మీకు తెలుసా.. ఓ ట్వీట్‌తో. ఒక ట్వీట్‌ అంటే కేవలం 140 అక్షరాల్లో. వారు ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఐదుగురు వీర జవాన్లు మృతి చెందారని తెలుపుతారు. కానీ వారి పేర్లును వెల్లడించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(బాయ్‌కాట్‌ చైనా)

ఈ పిటీషన్‌లో (Change.org/MartyrsOfIndia) సీకే సూద్‌ దేశ ప్రధాని / రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ.. అమరులైన జవాన్ల త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఓ మెమోంటో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘ఒక బలమైన కారణం కోసం ప్రతి ఏడాది ఎందరో జవాన్లు అమరులవుతున్నారు. వారిని ఒక్క సారి స్మరించుకుని తర్వాత మర్చిపోతారు. వారి కుటుంబాలను అస్సలు పట్టించుకోరు. ఈ పద్దతి మారాలి’ అన్నారు. ఇందుకు జనాలు తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ ఆన్‌లైన్‌ పిటీషన్‌ ఇప్పటికే 19,800 సంతకాలు సేకరించింది... వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 

>
మరిన్ని వార్తలు