భార్యకు రిటైర్డ్‌ ఐఏఎఫ్‌ అధికారి వినూత్న నివాళి..

10 Oct, 2018 15:22 IST|Sakshi
భార్యకు నివాళిగా ఆమె పనిచేసిన పాఠశాలకు భారీ విరాళం అందించిన రిటైర్డ్‌ ఐఏఎఫ్‌ అధికారి

సాక్షి, న్యూఢిల్లీ : మరణించిన భార్యకు నిజమైన నివాళిగా ఓ మాజీ ఐఏఎఫ్‌ అధికారి ఆమె 21 ఏళ్ల పాటు పాఠాలు చెప్పిన స్కూల్‌కు రూ 17 లక్షల విరాళం ఇచ్చి తన ఔదార్యం చాటుకున్నారు. ఐఏఎఫ్‌ సీనియర్‌ అధికారి, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ జేపీ బదౌని  భార్య దివంగత విధు బదౌని ఎయిర్‌ఫోర్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ఇనిస్టిట్యూట్‌లో 1986 నుంచి 21 సంవత్సరాల పాటు టీచర్‌గా సేవలు అందించారు. విధు బదౌని ఈ ఏడాది ఫిబ్రవరి 6న గుండెపోటుతో మరణించారు. ఆమె జ్ఞాపకార్ధం స్కూల్‌కు బదౌని రూ 17 లక్షలు విరాళం అందించారు.

విరాళంలో పది లక్షల రూపాయలను ప్రతి ఏటా ఆరు నుంచి పదకొండో తరగతి వరకూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, బహుమతులు అందించేందుకు వెచ్చిస్తామని, మిగిలిన మొత్తాన్ని ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని ప్రిన్సిపల్‌ పూనం ఎస్‌ రాంపాల్‌ చెప్పారు. తన భార్య జ్ఞాపకార్ధంగా ఆమె ఎంతో ఇష్టపడే పాఠశాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని బదౌనీ చెప్పారు. స్కూల్‌లో టీచర్‌గా పనిచేసినప్పటి నుంచి తన భార్య అందుకున్న జీతంలో ఆమె చేసిన పొదుపు సొమ్ముతోనే ఈ విరాళం అందిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు