కూతురు సాయంతో భర్తను చంపేసింది

8 Nov, 2023 05:40 IST|Sakshi
ప్రకాశ్‌రావు (ఫైల్‌)

శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో వారం రోజులు ఇంట్లోనే మృతదేహం

గొడ్డలితో ముక్కలు చేయాలని యత్నం.. అనంతరం ఇంట్లోనే పూడ్చాలని యోచన

కుదరకపోవడంతో పెట్రోల్‌ పోసి తగులబెట్టేందుకూ ప్రయత్నాలు

ఏదీ కుదరకపోవడంతో హడావుడిగా అంత్యక్రియలు

మొదట భార్య కత్తితో దాడి.. అనంతరం ముఖంపై దిండు అదిమిపట్టిన కూతురు

వేధింపులు భరించలేకే హత్య

సిరిసిల్ల క్రైం: మద్యానికి బానిసైన ఇంటిపెద్ద, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి.. ఇంట్లోవారిని కొట్టడం, దుర్భాషలాడటంతో భరించలేకపోయిన భార్య, కూతురు కలిసి అతన్ని పాశవికంగా హత్య చేశారు. సిరిసిల్లలో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్‌కు చెందిన లేచర్ల ప్రకాశ్‌రావు (44) జల్సాలకు అలవాటు పడటంతోపాటు, ఇంట్లో వారిపై తరచూ భౌతిక దాడులకు దిగేవాడు.

వేధింపులు తాళలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని, ఇందుకు చంపడమే మార్గమని అనుకున్నారు. ప్లాన్‌ ప్రకారం ఈ నెల 1న రాత్రి ప్రకాశ్‌రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో భార్య దాడి చేయగా, కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలంకావడంతో మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెడదామనుకున్నారు.

కానీ అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం తెలుస్తుందని భావించారు. తదుపరి పెట్రోలు పోసి కాల్చేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈనెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోలు తెప్పించి శవానికి నిప్పటించారు. మంటలు ఎగిసిపడడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆరి్పవేశారు. ఇలా కుదరదని నిర్ణయించుకుని ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళిక చేశారు.

దీనిలో భాగంగా ఈనెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈక్రమంలో ప్రకాశ్‌రావు నిద్రలో చనిపోయినట్లు కథ సృష్టించి దహనసంస్కారాలు చేసేందుకు దగ్గరి బంధువులకు సమాచారం అందించారు. చివరిచూపునకు కొద్ది మంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్‌లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు.  

ఇలా వెలుగులోకి.. 
ప్రకాశ్‌రావు నిద్రలో మృతిచెందాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు, బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మృతుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్‌రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్‌పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన టౌన్‌ సీఐ ఉపేందర్‌ హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్‌కు తరలించగా, హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. 

ప్రకాశ్‌రావు (ఫైల్‌) 

మరిన్ని వార్తలు