ఇరానీవి పచ్చి అబద్ధాలు

27 Feb, 2016 08:37 IST|Sakshi
ఇరానీవి పచ్చి అబద్ధాలు

రోహిత్ తల్లి రాధిక మండిపాటు
♦ నా బిడ్డను బలిగొన్నవారికి జీవిత ఖైదు వేసినా కూడా తక్కువే
♦ {పధాని చర్యలు తీసుకోకపోతే బీజేపీ నేలమట్టమే
 
 సాక్షి, న్యూఢిల్లీ: ‘నా బిడ్డ ఆత్మహత్యపై మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు.  మరణానికి బాధ్యులైన మంత్రులు ఇరానీ, దత్తాత్రేయ, వీసీ, ఏబీవీపీ కార్యకర్తలకు జీవిత ఖైదు వేసినా కూడా తక్కువే. మంత్రులపై మోదీ చర్యలు తీసుకోకపోతే బీజేపీ నేలమట్టమవుతుంది. ఆరెస్సెస్, ఏబీవీపీ వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదు..’ అని  రోహిత్ వేముల తల్లి రాధిక అన్నారు. శుక్రవారమిక్కడ ఆమె తన రెండో కుమారుడు రాజాతో కలసి మీడియాతో మాట్లాడారు.

 ఇరానీ.. ఇది బుల్లితెర కాదు..
 ‘ఇరానీ.. నటించడానికి ఇది బుల్లితెర కాదు. నిజ జీవితం. నిజాలకు మసిపోయొద్దు. ఇంకెంతమంది తల్లిదండ్రులు బాధపడాలనుకుంటున్నారు?’ అని అన్నారు. కేసుపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, తన బిడ్డను తీవ్రవాదిగా ముద్రవేయడంపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. ‘నాకు ఏపీలో న్యాయం జరగలేదు. అందుకే ఢిల్లీ వచ్చాను. దేశవ్యాప్తంగా చాలా మంది నన్ను ఓదార్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి, టీఆర్‌ఎస్ నుంచి ఒక్కరూ రాలేదు..’ అని అన్నారు. రాహుల్ గాంధీ మానవత్వంతోనే వచ్చారన్నారు. కులం గురించి ప్రశ్నించగా.. న్యాయం కోసం చేస్తున్న తమ పోరాటం నుంచి దృష్టి మళ్లించడానికి పదేపదే ఆ అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. రోహిత్ చనిపోయిన మరుసటి రోజు ఉదయం 6వరకు డాక్టర్లను, పోలీసులను అనుతించలేదని ఇరానీ చెప్పడాన్ని రోహిత్ తమ్ముడు రాజా ఖండించారు. అంతకు ముందు రోజు రాత్రి 8.30కే తాను క్యాంపస్ చేరుకున్నానని, అప్పటికే పోలీసులు, డాక్టర్లు ఉన్నారన్నారు.

మరిన్ని వార్తలు