Kedarnath: ప్రత్యర్థి పార్టీల ఎంపీలు.. రాహుల్‌, వరుణ్‌గాంధీ అప్యాయ పలకరింపు

8 Nov, 2023 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ సోదరులే... కాకపోతే దశాబ్దాలుగా ఎడముఖం పెడముఖమే. ఇద్దరూ రాజకీయనేతలే. పార్లమెంటు సభ్యులే. కానీ పార్టీలు మాత్రం వేర్వేరు. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు అకస్మాత్తుగా.. అనుకోకుండానే ఒకరికొకరు తారసపడితే? ఇలాంటి అపురూపమైన ఘట్టమే మంగళవారం ఉత్తారఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఆవిషృ‍తమైంది. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ.. ఇందిరగాంధీ రెండో కోడలైన మేనకా గాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ! 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడు రోజులుగా రాహుల్‌ గాంధీ కేదార్‌నాథ్‌లోనే ఉంటున్నారు. అయితే మంగళవారం వరుణ్‌ గాంధీ తన కుటుంబంతో కలిసి కేదార్‌నాథ్‌లో శివుడిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సమయంలోనే ఇద్దరు సోదరులు ఒకరికొకరు ఎదురయ్యారు.

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఆలయం బయట ఇద్దరు నేతలు కలుసుకొని కొద్దసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే ఈ సమావేశం చాలా తక్కువ సమయం జరిగిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి సంభాషణలో రాజకీయాల గురించి చర్చ జరగలేదని తెలిపాయి. వరుణ్‌ కుమార్తెను చూసి రాహుల్‌ సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాగా రాహుల్‌ వరుణ్‌ ఇద్దరూ సోదరులే అయినప్పటికీ బహిరంగంగా కలిసి కనిపించడం చాలా అరుదు. అయితే ఉన్నట్టుండి ఈ ప్రత్యర్థి పార్టీ ఎంపీలు ఎదురుపడటం, సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌తో భేటీ కావడంతో వరుణ్‌ త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు వరుణ్‌ గాంధీ ఆ మధ్య కాలంలో బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీ ముఖ్య సమావేశాల్లో ఆయన కనిపించడం లేదు. అంతేగాక కొత్త వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరీ ఘటన సహా పలు కీల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని బహరింగానే  ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరనున్నారనే సందేహాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఇక సంజయ్‌ గాంధీ, మేనకాగాంధీల కుమారుడు అయిన  వరుణ్‌ గాంధీ ప్రస్తుతం  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిలిభిత్‌ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే గతేడాది వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయని..ఆయన్నుపార్టీలోకి ఆహ్వానిస్తారా అని రాహుల్‌కు ఓ మీడియా సమావేశంలో ప్రశ్న ఎదురైంది. దీనికి వయనాడ్‌ ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి ఎవరినైనా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే వరుణ్‌ బీజేపీ/ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు