వర్షాలతో రూ.2,200 కోట్ల నష్టం!

3 Oct, 2016 02:30 IST|Sakshi

- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు రాష్ట్రం నివేదిక
 
సాక్షి, న్యూఢిల్లీ: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థిక  మంత్రి ఈటల, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారమిక్కడ రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు సంభవించిన నష్టంపై నివేదిక అందించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ‘‘మా విజ్ఞప్తిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపి, నష్టాన్ని అంచనా వేసి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు’’ అని మహమూద్ అలీ చెప్పారు.
 
వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఆ మేరకు రూపొందించిన ప్రాథమిక అంచనా నివేదికను రాజ్‌నాథ్‌కు అందజేశామని మంత్రి ఈటల తెలిపారు. ఇటీవలి వర్షాలతో హైదరాబాద్‌కు రూ.1,157 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ.463 కోట్ల మేర ఆర్‌అండ్‌బీ, రూ.298 కోట్ల మేరకు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మిడ్ మానేరుతో సహా 671 చెరువులకు గండి పడిందనివివరించారు. వర్షాలతో 46 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు