రక్షణ సామగ్రి కోసం 83వేల కోట్ల ఆర్డర్లు

28 Feb, 2015 04:29 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగం 2011-2014 వరకు రూ.83,858 కోట్ల విలువైన రక్షణ పరికరాలకు ఆర్డర్లు ఇచ్చిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. దేశీయ రక్షణ పరిశ్రమలు రూ.69 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేశాయని చెప్పారు. విదేశీ విక్రేతలకు 2011-12, 2013-14లలో భారత వైమానిక దళం రూ.55,406 కోట్లు, సైనిక దళం రూ.25,454 కోట్లు, నావికా దళం రూ.2,998 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయని మంత్రి లోక్‌సభలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 కాగా, అత్యాచారాలకు పాల్పడితే కాళ్లు, చేతులు నరికే చట్టం తీసుకురావాలని ఎంపీ రామదాస్ అథవాలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేసీ త్యాగి(జేడీయూ) డిమాండ్ చేశారు. ఇంటర్‌నెట్‌లో అసభ్య సమాచారాన్ని ఉంచే సైట్లను గుర్తించే పనిని ఇంటర్‌నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ)కి అప్పగించామని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు