సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

31 Jul, 2018 16:22 IST|Sakshi
సాధ్వి ప్రాచి

లక్నో : విశ్వ హిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ట్రిపుల్‌ తలాఖ్‌, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాచి పేర్కొన్నారు.  ఇటువంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్‌(బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా సోమవారం గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాధ్వి ప్రాచి.. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్‌) ఈసారి కూడా రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. ‘కాంగ్రెస్‌ అగ్రనేతలపై వ్యాఖ్యలు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడి వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అంటూ మండిపడ్డారు.

చదవండి : నిఖా హలాల పేరిట నరకం...

మరిన్ని వార్తలు