-

విద్యార్థుల ఎదుటే టీచర్‌కు తలాక్‌ చెప్పిన భర్త

1 Sep, 2023 05:36 IST|Sakshi

బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్‌కు ఆమె భర్త ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఆగస్ట్‌ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్‌ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు.

అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్‌ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్‌.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్‌ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్‌ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్‌ తలాక్‌ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు