నేషనల్‌ హెరాల్డ్‌ కేసు : నేడు సుప్రీం విచారణ

13 Nov, 2018 09:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి 2011-12లో తమ పన్ను వివరాల తనిఖీపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కాం‍గ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. ఈ కేసులో 2011-12 ట్యాక్స్‌ అసెస్‌మెంట్ల పునఃపరిశీలన నుంచి తమకు ఊరట కల్పించాలన్న రాహుల్‌, సోనియాల అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్‌ 10న వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ విచారించనుంది.

హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలైనందున ఆదాయ పన్ను శాఖ సర్వోన్నత న్యాయస్ధానంలో కేవియట్‌ దాఖలు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్‌ అగ్ర నేతలపై ఆదాయ పన్ను విచారణ తలెత్తింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో 2015, డిసెంబర్‌ 19న ప్రత్యేక న్యాయస్ధానం సోనియా, రాహుల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

యంగ్‌ ఇండియన్‌ అనే సంస్థ ద్వారా సోనియా, రాహుల్‌,ఇతరులు కేవలం రూ 50 లక్షలు చెల్లించి నేషనల్‌ హెరాల్డ్‌ను నిర్వహించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు కాంగ్రెస్‌ పార్టీ బకాయిపడిన రూ 90.25 కోట్లు వసూలు చేసుకునే హక్కులు పొందారని సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 2010 నవంబర్‌లో ఏర్పాటైన యంగ్‌ ఇండియా కేవలం రూ 50 లక్షల పెట్టుబడితో ఏజేఎల్‌లోని షేర్లన్నంటినీ కొనుగోలు చేసిందని స్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే యంగ్‌ ఇండియాలో రాహుల్‌కున్న షేర్లతో ఆయన ఆదాయం రూ 154 కోట్లని, ట్యాక్స్‌ రిటన్స్‌లో చూపినట్టు రూ 68 లక్షలు కాదని ఆదాయ పన్ను శాఖ వాదిస్తోంది.

మరిన్ని వార్తలు