మిమ్మల్ని జైలుకు పంపాలి

8 Aug, 2018 01:45 IST|Sakshi

ఎన్నార్సీ విషయంపై రిజిస్ట్రార్‌ జనరల్, ఎన్నార్సీ కోఆర్డినేటర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: అస్సాంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)లో 40 లక్షలకుపైగా పేర్లు లేకపోవడంతో ఒకపక్క వివాదం చెలరేగుతుండగా..ఈ అంశంపై మీడియాతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీఐ)ను, అస్సాం ఎన్నార్సీ కోర్డినేటర్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. కోర్టు ఈ విషయమై విచారణ జరిపింది. ఎన్నార్సీ ముసాయిదాలో పేర్లు నమోదు లేని వారి అభ్యంతరాలు, విజ్ఞాపనలపై ఆర్‌జీఐ శైలేష్, అస్సాం ఎన్నార్సీ కో ఆర్డినేటర్‌ ప్రతీక్‌ హజేలా మీడియాతో మాట్లాడిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది.

‘ఈ అంశంపై మీడియా ముందు మాట్లాడేందుకు మీకేం అధికారం ఉంది? మీకు సంబంధం ఏంటి? మీరు చెప్పిందంతా పత్రికల్లో వచ్చింది. దాని పర్యవసానాలేమిటో ఆలోచించారా?’ అని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు కోర్టు ఆదేశాలు, సూచనల మేరకు పనిచేసే అధికారులు. పత్రికలతో ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన విషయాల ప్రభావం మాపై ప్రభావం పడుతుంది. ఇది చాలా తీవ్రమైన అంశం. ధిక్కారం నేరం కింద మిమ్మల్ని జైలుకు పంపేవాళ్లమే.

కానీ, అస్సాంలో ఎన్నార్సీ తుది జాబితా రూపకల్పన, ముద్రణ అనే కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉండటంతో మిమ్మల్ని వదిలేస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది. దీంతో ఆర్‌జీఐ శైలేష్, ఎన్నార్సీ కో ఆర్డినేటర్‌ ప్రతీక్‌ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఎన్నార్సీ ముసాయిదాలో పేర్లు లేనివారి అభ్యంతరాలు, విజ్ఞాపనలను పరిశీలించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాల్సిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రానికి సూచించింది.

మరిన్ని వార్తలు