యూపీ సీఎంకు సుప్రీం షాక్‌

20 Aug, 2018 14:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 2007లో యోగి ఆదిత్యానాథ్‌ విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం యూపీ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్‌ శాఖకు నోటీసులు జారీ చేసింది.  ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన సుప్రీం బెంచ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో యోగి ఆదిత్యానాథ్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని అలహాబాద్‌ హైకోర్టు సమర్ధించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం నాలుగు వారాల్లోగా దీనిపై బదులివ్వాలని యూపీ సర్కార్‌తో పాటు పోలీస్‌ శాఖను కోరింది. 2007లో యోగి విద్వేష ప్రసంగంతోనే గోరఖ్‌పూర్‌లో అల్లర్లు చెలరేగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అసద్‌ హ్యాత్‌, పర్వేజ్‌లు 2008లో అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు.

అప్పట్లో గోరఖ్‌పూర్‌ ఎంపీగా వ్యవహరించిన యోగి ఆదిత్యానాథ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు 11 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్నారు. 2018 ఫిబ్రవరి 1న యోగి సహా ఎనిమిది మంది నిందితులపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్లలో ఒకరైన పర్వేజ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు