అయోధ్యలో కేబినెట్ భేటీ.. ఇదే తొలిసారి

9 Nov, 2023 14:35 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నోలో కాకుండా అయోధ్యలో తొలిసారి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో అయోధ్య అభివృద్ధికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సమావేశానికి ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ మంత్రులతో కలిసి హనుమాన్ గర్హి రామాలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం సరయూ నది ఒడ్డున ఉన్న రామకథా మండపంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. 2019 జనవరిలో లక్నోలో కాకుండా ప్రయాగ్‌రాజ్‌లో మొదటిసారి కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాత అయోధ్యలో ఇదే ప్రథమం.

నవంబర్ 9న అయోధ్యలో కేబినెట్ భేటీ నిర్వహించడానికి ఓ ప్రత్యేకత ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 1989లో నవంబర్ 9న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ శంకుస్థాపన చేసింది. 2019 నవంబర్ 9నే బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

ఇదీ చదవండి: ఎన్నడూ స్కూల్‌కు వెళ‍్లనేలేదు.. తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం

మరిన్ని వార్తలు