మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా

4 Jun, 2016 11:55 IST|Sakshi
మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వెళ్లిన ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఓ లేఖను అందించారు. అక్రమ భూకేటాయింపులలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడి, ఈ ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాంతోపాటు దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు చాలాసార్లు ఉందని ఒక హ్యాకర్ ఆరోపించడం సైతం ఆయన పదవికి ఎసరు తెచ్చింది.

ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కూడా రెవెన్యూ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే డుమ్మాకొట్టారు. గత సోమవారం నుంచి ఆయన తన ఎర్రబుగ్గ కారును కూడా వాడటం మానేశారు. గత ఏప్రిల్ నెలలో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు.

మరిన్ని వార్తలు