రూ.150 ఖర్చుతో 300 కిమీ ప్రయాణం.. కొత్త కారుతో సత్తా చాటిన రైతుబిడ్డ!

7 Nov, 2023 13:50 IST|Sakshi

గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' (Devendra Fadnavis) ఈ కారుని వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు ప్రత్యేకమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంత గొప్ప కారుని తయారు చేసిన నక్షనేనిని 'దేవేంద్ర ఫడ్నవిస్‌' కలిసి అభినందించారు. అంతే కాకుండా అతన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

గ్రీన్ కలర్‌లో కనిపించే ఈ కారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ 'సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్' పొందినట్లు హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనకు తానుగానే ముందుకు వెళ్లడం చూడవచ్చు.

ఈ హైడ్రోజన్ కారుని తయారు చేయడానికి హర్షల్ నక్షనేనికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. ఈ కారు కేవలం రూ.150 హైడ్రోజన్‌తో ఏకంగా 300 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపాడు. ఫెరారీ కారుని తలపించే డోర్స్, సన్‌రూఫ్ వంటివి ఇందులో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.

గ్రీన్ కలర్ హోమ్‌మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల ఖచ్చితమైన లాంచ్ గురించి వివరించలేదు. అంతే కాకుండా ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించాల్సి ఉంది. దీనికోసం Aicars.in వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు.

ఇలాంటి వాహనాలు భారతదేశంలో చట్టవిరుద్ధం
హర్షల్ నక్షనేని అద్భుతమైన సృష్టి అందరి ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇలాంటివి పబ్లిక్ రోడ్డుమీద ఉపయోగించడానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒక వాహనం రోడ్డు మీదికి రావాలంటే ఖచ్చితంగా 'ఏఆర్ఏఐ' (Automotive Research Association of India) దృవీకరించాలి.

మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి ఒక వాహనం పబ్లిక్ రోడ్ల మీదికి రావాలంటే సంబంధిత వివిధ అధికారుల నుంచి ఆమోదం పొందాలి. లేకుంటే ఇవి  ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించి, రేసింగ్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు మాత్రమే పరిమితం చేస్తారు. పబ్లిక్ రోడ్‌లలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.

ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్

ప్రస్తుతం మన దేశంలో హైడ్రోజన్ కార్ల వినియోగానికి కావాల్సిన కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ కార్ల కంటే ఎక్కువ పరిధిని, తక్కువ కాలుష్యం కలిగించే ఇలాంటి వాహనాలను వినియోగించాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హైడ్రోజన్ కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు