ఇంగ్లిష్‌లో మాట్లాడలేదని...!

21 Jan, 2016 19:21 IST|Sakshi
ఇంగ్లిష్‌లో మాట్లాడలేదని...!

గువాహటి: మాతృభాషలో మాట్లాడటమే ఈ చిన్నారుల నేరమైంది. ఆంగ్లంలో మాట్లాడాలన్న నిబంధనను ఉల్లంఘిస్తారా అంటూ ఏకంగా 13 మంది విద్యార్థులను తీవ్రంగా శిక్షించింది ఓ ప్రైవేటు పాఠశాల. ఈ ఘటన అసోం రాజధాని గువాహటిలో బుధవారం జరిగింది. గువాహటిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో 13 మంది విద్యార్థులు మాతృభాష అస్సామీలో మాట్లాడినందుకు స్కూల్ యాజమాన్యం కన్నెర్రజేసింది. తమ స్కూల్‌లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలన్న నిబంధనను ఉల్లంఘించినందుకు ఆ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా అడ్డుకుంది. దాదాపు 90 నిమిషాలపాటు నిలిపి ఉంచింది.

కాథలిక్ ఆధ్వర్యంలోని స్కూల్‌లో జరిగిన ఈ ఘటనపై అసోం జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. మాతృభాషలో మాట్లాడినందుకు విద్యార్థులను శిక్షించిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌ ప్రతిమ రంగ్‌పిపిని ఆదేశించినట్టు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఎం అంగముత్తు తెలిపారు. అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక భాషగా అస్సామీని తప్పకుండా బోధించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు