ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే..

28 Nov, 2023 22:07 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. నవంబర్‌ 12న టన్నెల్‌ కూలిపోయి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ర్యాట్‌-హోల్‌ పద్ధతిలో డ్రిల్లింగ్‌ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల కార్మికులు చిక్కుకున్న చోటకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇందులో కీలకంగా పాత్ర వహించిన నలుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్‌డీఎంఏ పాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శ్రీనగర్‌లోని భారత సైన్యం జీవోసీ 15 కార్ప్స్‌లో మాజీ సభ్యుడు. 2018 జూలై 13న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా లెఫ్టినెంట్ జనరల్ హస్నైన్‌ను నియమించారు.

మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్
నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్‌బోర్న్‌కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన  మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టులలో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు.

ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్
రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్‌ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. గత పది రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.

అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్
ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్‌ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ  ఆపరేషన్‌లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్ ప్రకారం.. ఆర్నాల్డ్‌ బారిస్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భూగర్భ, రవాణా మౌలిక రంగంలో నిపుణుడు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది.
 

మరిన్ని వార్తలు