ముగ్గురు ప్రియురాళ్లు... తొమ్మిది బ్యాంకులు

22 Apr, 2014 04:46 IST|Sakshi
ముగ్గురు ప్రియురాళ్లు... తొమ్మిది బ్యాంకులు

జల్సాల కోసం 9 బ్యాంకులు దోపిడీ చేసిన మాజీ సైనికుడు
 భోపాల్: ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంటేనే పర్సు ఖాళీ అయ్యే పరిస్థితుల్లో.. ముగ్గురు ప్రియురాళ్ల ముచ్చట తీర్చాలంటే ఏమేరకు సంపాదన ఉండాలి. బ్యాంకులకు కన్నాలేయాల్సిందే కదా. అదే పనిచేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ సైనికోద్యోగి అనిల్ రాజవత్. తన ప్రియురాళ్ల వద్ద బడాయి చూపించడానికి ఒకటీ రెండు కాదు ఏకంగా తొమ్మిది బ్యాంకులకు కన్నమేశాడా ప్రియుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ యూకో బ్యాంక్‌లో రూ.36.46 లక్షలు దోపిడీ చేసిన తర్వాత సోహన్‌లో హిమాచల్‌ప్రదేశ్ పోలీసులకు చిక్కడంతో అతని బండారం బయటపడింది. ఏడేళ్ల పాటు ఆర్మీలో పనిచేసిన తర్వాత బ్యాంకులను దోపిడీ చేసే టెక్నిక్స్ నేర్చుకున్నాడు.
 
 దానికి ఆర్మీ కఠోర శిక్షణ కూడా అతడికి తోడ్పడింది. లాకర్లను గ్యాస్ కటర్‌తో కట్ చేసి దోపిడీకి పాల్పడేవాడు. ఆ దోపిడీలకు అతని స్నేహితులు ఇద్దరు సహకారం అందించేవారు. దోపిడీకి లక్ష్యంగా బ్యాంకును ఎంచుకున్న తర్వాత అక్కడ ముగ్గురూ కలసి రెక్కీ నిర్వహించేవారు. దొంగిలించిన డబ్బు అయిపోయిన తర్వాత మరో బ్యాంకు.. ఇలా దోపిడీ పర్వం కొనసాగించానని పోలీసులకు చెప్పాడు. ఆ డబ్బంతా తన ప్రియురాళ్ల వద్ద గొప్పల కోసమే ఖర్చు పెట్టానని పోలీసులకు వివరించాడు రాజవత్.

మరిన్ని వార్తలు