లోన్లు తీసుకుంటున్నారు.. బ్యాంకులకు రోజుకు రూ.100 కోట్లు ఎగవేతకు పాల్పడుతున్నారు

29 Oct, 2023 09:03 IST|Sakshi

దేశంలో కావాలనే బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రతి రోజు ఉద్దేశ పూర్వకంగా (Wilful Defaulter) ఎగవేతకు పాల్పడుతున్న సొమ్ము రూ.100 కోట్లుగా ఉంది. గత నాలుగేండ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.2 లక్షల కోట్ల మేరకు పేరుకుందని బిజినెస్‌ స్టాండర్డ్‌ తెలిపింది. 

ఎగవేత దారులు ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే 
విల్‌ఫుల్‌ డిఫాల్టర్లు బ్యాంక్‌లకు ఎగవేసిన మొత్తం..దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలో అధికంగా ఉంది. 2019 మార్చి నుంచి మహారాష్ట్రలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల బకాయి మొత్తం రూ.60,000 కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఈ తరహా రుణాల్లో 70 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, తమిళనాడుల్లో పేరుకుపోయింది. గత నాలుగేండ్లలో ఢిల్లీలోనైనే ఉద్దేశపూర్వక ఎగవేత మొత్తం 200 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరగా, మిగిలిన రాష్ట్రాల్లో ఈ పెరుగుదల 95 శాతం మేర ఉన్నది.

ఎగవేత దారులంటే?
ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ గణాంకాల ప్రకారం 2019 మార్చి నుంచి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంక్‌లకు బకాయిపడిన సొమ్ము 50 శాతంపైగా పెరిగి, 2023 జూన్‌ నాటికి మొత్తం బకాయిలు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. కట్టగలిగే సామర్ధ్యం ఉండి తీసుకున్న లోన్లను 6 నెలలు లోపు చెల్లించని వారిని ఉద్దేశ పూర్వకంగా ఎగవేత దారులకు ప్రకటించాలని ఇటీవల ఆర్‌బీఐ ప్రతిపాదన తెచ్చింది. 

ప్రభుత్వ బ్యాంకుల్లో అధికం
మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ‍్డ్‌ బ్యాంక్స్‌ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్‌ బ్యాంక్‌ అకౌంట్లు  2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి  36,150 ఎన్‌పీఏ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది. 

మరిన్ని వార్తలు