మహాబోధి ఆలయంలో వరుస పేలుళ్లు

8 Jul, 2013 05:32 IST|Sakshi
Bodhgaya


 గయ (బీహార్): శాంతిదూత గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర క్షేత్రం బుద్ధగయపై ఉగ్రవాదులు పంజా విసిరారు. బౌద్ధుల తీర్థయాత్రా స్థలాల్లో అత్యంత ప్రముఖమైన మహాబోధి ఆలయ సముదాయంలో ఆదివారం ఉదయం వరుస బాంబు దాడులకు తెగబడ్డారు. ఉదయం 5:30 గంటల నుంచి 5:58 గంటల మధ్య వరుసగా తొమ్మిది బాంబులు పేల్చారు. అయితే.. పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణనష్టమేమీ సంభవించనప్పటికీ.. ఇద్దరు విదేశీ బౌద్ధ భిక్షువులు గాయపడ్డారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం, మహాబోధి ఆలయానికి ఈ పేలుళ్ల వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు.
 
 శ్రీలంక, చైనా, జపాన్‌లతో పాటు మొత్తం దక్షిణాసియాలోని బౌద్ధ తీర్థయాత్రికులు పెద్ద సంఖ్యలో సందర్శించే మహాబోధి ఆలయంపై.. మయన్మార్‌లో ముస్లింలపై అత్యాచారాలకు ప్రతీకారంగా గత ఏడాదే ఫిదాయీ దాడికి కుట్ర జరిగిందని.. అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ శక్తులను అరెస్ట్ చేయటంతో ఆ దాడిని నిరోధించామని ఢిల్లీ పోలీసులు గతంలో పేర్కొన్నారు. యునెస్కో చారిత్రక సంపద స్థలంగా ప్రకటించిన ఈ ఆలయంపై తాజాగా ఆదివారం తెల్లవారుతుండగానే వరుస బాంబు పేలుళ్లు జరగటంతో బుద్ధగయ వణికిపోయింది. మావోయిస్టులకు గట్టి పట్టు ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దాడులకు బాధ్యులం తామేనని ఏ సంస్థా ప్రకటించలేదు. అయితే ఇది ఉగ్రవాదుల దాడేనని కేంద్రం, బీహార్ ప్రభుత్వం అభివర్ణించాయి. ఈ బాంబు దాడులు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల పనేనని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన ఆధారాల కోసం సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ పేలుళ్లకు నాటు బాంబులు ఉపయోగించినట్లు కేంద్రానికి రాష్ట్ర పోలీసులు అందించిన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నారు.
 
 తొమ్మిది బాంబులనూ టైమర్లతో పేల్చారు. మహాబోధి ఆలయ సముదాయంలో నాలుగు పేలుళ్లు జరగగా.. కర్మపా ఆరామంలో మూడు పేలుళ్లు, ప్రఖ్యాత 80 అడుగుల బుద్ధ విగ్రహం వద్ద ఒక పేలుడు, బైపాస్ సమీపంలోని బస్టాండ్ వద్ద ఒక పేలుడు సంభవించాయని మగధ రేంజ్ డీఐజీ నయ్యర్‌హుస్నైన్‌ఖాన్ తెలిపారు. తొలి బాంబు బోధి వృక్షం వద్ద టేబుల్ కింద పేలిందని, దీనివల్ల ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఆలయ కమిటీ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన బిక్షువులను టిబెట్‌కు చెందిన టెంజింగ్ లామా, మయన్మార్‌కు చెందిన బాలసంగాలుగా గుర్తించారు. లామాకు కాళ్లకు గాయాలు కాగా, సంగాకు కుడి చేయి దెబ్బతిన్నది. వారిద్దరినీ మగధ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. రెండో పేలుడు పుస్తకాలున్న గదిలో సంభవించినట్లు తెలుస్తోందని.. దీనివల్ల సామగ్రి కొంత దెబ్బతిన్నప్పటికీ స్మారకచిహ్నాలు, విగ్రహాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడొకరు చెప్పారు. బుద్ధుని 80 అడుగుల విగ్రహం వద్ద ఒక బాంబును, బస్టాండ్ సమీపంలో తెరెగా ఆరామం వద్ద ఒక సిలిండర్ బాంబును పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. కొన్ని గంటల తర్వాత మహాబోధి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల బైజుబిఘా గ్రామం వద్ద ఒక హోటల్ సమీపంలో మరొక సిలిండర్ బాంబును భద్రతా సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారు.
 
 దర్యాప్తు కోసం ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు
 బుద్ధగయలో బాంబు పేలుళ్లపై దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) బృందాలను పంపినట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. ఈ బృందాలు ప్రత్యేక హెలికాప్టర్‌లో బుద్ధగయకు వెళ్లగా అక్కడ వాతావరణం అనుకూలించకపోవటంతో తిరిగి ఢిల్లీ వెళ్లి విమానంలో పాట్నా చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రికి బుద్ధగయ చేరుకున్నాయి.
 
 బౌద్ధాలయాల భద్రతకు కేంద్రం సూచన
 బుద్ధగయపై బాంబు దాడి నేపథ్యంలో దేశంలోని అన్ని బౌద్ధాలయాలు, టిబెటన్ల ఆవాస ప్రాంతాలకు పటిష్ట భద్రత కల్పించాలని అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. మయన్మార్‌లో ముస్లింలు, బౌద్ధుల మధ్య హింస కొనసాగుతున్న నేపథ్యంలో బౌద్ధాలయాలు, బౌద్ధ ప్రార్థనామందిరాలు, టిబెటన్ల ఆవాస ప్రాంతాలకు తగినంత భద్రత కల్పించాలని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రత్యేకంగా సూచించింది. మయన్మార్‌లో కొనసాగుతున్న మత హింసలో ఏడాదిలో 250 మంది చనిపోయారని, లక్షా యాభై వేల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించింది.
 
 దాడికి ప్రధాని, రాష్ట్రపతి ఖండన
 బుద్ధగయపై ఉగ్రవాద దాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లు తీవ్రంగా ఖండించారు. ‘‘మన సమ్మిళిత సంస్కృతి, సంప్రదాయాలు అన్ని మతాలనూ గౌరవించాలని బోధిస్తాయి. మతపరమైన స్థలాలపై ఇలాంటి దాడులను ఎన్నడూ సహించేది లేదు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. ‘‘శాంతిదూత అయిన బుద్ధిడిని పూజించేందుకు వచ్చిన అమాయకులను లక్ష్యంగా చేసుకున్న అవివేకమైన హింసాత్మక ఘటన ఇది’’ అని రాష్ట్రపతి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. బాంబు పేలుళ్ల ఘటన పిరికిపందల చర్యగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అభి వర్ణించారు. దోషులను వీలైనంత త్వరగా పట్టుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.
 
 ప్రార్థనలు యథాతథం
 మహాబోధి ఆలయంలో రోజువారీ భిక్షువుల ప్రార్థనలు యథావిధిగా జరుగుతాయని, సందర్శకులకు మాత్రం ప్రస్తుతానికి ప్రవేశం నిలిపివేశామని రాష్ట్ర డీజీపీ అభయానంద్ తెలిపారు. పేలుళ్లకు ఉపయోగించినవి తక్కువ తీవ్రత గల టైంబాంబులని.. గర్భగుడి చెక్కుచెదరలేదని.. ఆలయ ఆవరణలో కొంత నష్టం వాటిల్లిందన్నారు. మహాబోధి ఆలయానికి భద్రత కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్ జవాన్లను మోహరించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్  ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు