కూలిన భవనం.. ఏడుగురు మృతి..

23 Jul, 2016 21:15 IST|Sakshi
కూలిన భవనం.. ఏడుగురు మృతి..

డార్జలింగ్ః పశ్చిమ బెంగాల్ లో  భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. డార్జలింగ్ పట్టణంలోని ఓ మూడంతస్థుల పురాతన భవనం కుప్పకూలిన ప్రమాదంలో మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని డాక్టర్ జకీర్ హుస్సేన్ బస్తీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ఎస్పీ.. అమిత్ జవల్గీ తెలిపారు.

పురాతన భవనం కుప్పకూలడంతో పశ్చిమబెంగాల్ డార్జలింగ్ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో శిథిలాల కింద పడి ఏడుగురు మరణించగా, ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిని స్థానిక డాక్టర్ జకీర్ హుస్సేన్ బస్తీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శిథిలాలకింద పడి చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు మహిళలే ఉన్నట్లు తెలిపారు. 1968 లో సదరు భవనం నిర్మాణం జరిగినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. ఇన్నేళ్ళుగా భవనానికి ఎటువంటి రిపేర్లు చేయించలేదని, పునాదులు కూడా బాగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నాళ్ళుగా కురుస్తున్న వర్షాలకు భవనం కూలిపోయినట్లు చెప్తున్నారు.

ప్రమాదంలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికీ 2 లక్షల రూపాయల చొప్పున,  తీవ్రంగా  గాయపడ్డవారికి వైద్యం నిమిత్తం 1 లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాక మృతి చెందినవారి అంత్య క్రియలకోసం వారి కుటుంబాలకు ప్రత్యేకంగా 10,000 రూపాయలు వెంటనే అందించే ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు