ఇంకెంత మంది బలవ్వాలి.. ప్రమాదకరంగా గుంతల రోడ్డు!

22 Dec, 2023 12:12 IST|Sakshi
ఇద్దరిని కబలించిన గుంతలు పడ్డ రోడ్డు

ప్రాణాలను కబళిస్తున్న గుంతలరోడ్డు

మరమ్మతులు చేసినా ముణ్నాళ్ల ముచ్చటే

రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత

యాక్సిడెంట్లు పెరిగినా కళ్లు తెరువని అధికారులు

చొప్పదండి: ఇంటి నుంచి బయలుదేరి గమ్యస్థానం చేరక ముందే రోడ్డుపై ఉన్న గుంతల మూలంగా ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడ్డారు. చొప్పదండి పట్టణంలో గురువారం జరిగిన ఘటన ఇక్కడి ప్రజలకు కొత్తేం కాదు. ప్రతీ నెలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, యువకులు, పెద్దలు బైక్‌పై ప్రయాణించే వారి మరణాలు పెరుగుతూనే ఉన్నాయి, అయినా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు.

ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు శూన్యం. కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, కనీసం ఉన్న రోడ్డును మరమ్మతు చేసే దిక్కు లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రోడ్డుపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

మూణ్నాళ్ల ముచ్చటే..
పట్టణంలోని కరీంనగర్‌, రాయపట్నం ప్రధాన రహదారి గుంతలమయమై రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. మరమ్మతులు చేసినా మూణ్నాళ్ల ముచ్చటే గుంతలరోడ్డు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది.

పగలు, రాత్రి తేడా లేకుండా తరుచూ ప్రమాదాలు సంభవించి యువతను పొట్టన పెట్టుకుంటోంది. ఇంత జరుగుతున్నా రోడ్లు భవనాలశాఖ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదకరంగా బైక్‌ ప్రయాణం
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ పనులు నడుస్తున్న క్రమంలో రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాలతో రోడ్డు ఇరుకుగా మారింది. రోడ్డుపై ఉన్న మట్టి సకాలంలో తొలగించకపోవడం వాహనదారులకు దినదిన గండమైంది. దీనికి తోడు కొన్ని నెలలుగా పట్టణంలో గుంతలు పడ్డ ప్రధాన బీటీరోడ్డును మరమ్మతు చేయలేదు.

సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేపట్టిన నేపథ్యంలో బీటీ మరమ్మతు చేయక పోగా ఏడాదిగా రోడ్డు ప్రమాదా లు పెరుగుతూనే ఉన్నాయి. వందఅడుగుల రహదారి అభివృద్ధికాక ముందే కాంట్రాక్టర్‌ రోడ్డు మధ్యలో డివైడర్‌ నిర్మించడం ఇప్పుడు వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. అధికారులు రోడ్డు అభివృద్ధి కాకముందే డివైడర్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. డివైడర్‌ వేసి రోడ్డును కుదించడం విమర్శలకు తావిస్తోంది.

ఇటీవల జరిగిన ప్రమాదాలు
పట్టణంలోని ఎస్‌బీఐ ఎదుట ఆర్‌అండ్‌బీ రోడ్డుపై జూన్‌ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. బైక్‌లపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి మృత్యువాతపడ్డారు. ముగ్గురు యువకులు ఒక్కొక్కరేకావడం విషాదకరం.

►సెప్టెంబర్‌ 9న అదే ఎస్‌బీఐ ఎదుట బైక్‌ అదుపు తప్పి టిప్పర్‌ను ఢీకొన్న సంఘటనలో చికిత్స పొందుతూ ఒక పదిహేనేళ్ల యువకుడు మరణించాడు.

►సెప్టెంబర్‌ 17న మర్లవాడ సమీపంలో ప్రధాన రహదారిపై వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న పంచాయతీ కార్యదర్శి మృతిచెందాడు.

►సెప్టెంబర్‌ 29న కాంట సమీపంలో గుంతల మూలంగా బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో చికిత్స పొందుతూ దత్తోజిపల్లికి చెందిన వెల్డర్‌ మృతి చెందాడు.

►డిసెంబర్‌ 21న సిద్ధార్థ స్కూల్‌ సమీపంలో గుంతలరోడ్డుపై కారు బైక్‌ను ఢీకొనడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు.

మల్లాపూర్‌లో విషాదం..
ధర్మారం: చొప్పదండిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో ధర్మారం మండలం మల్లాపూర్‌ గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన పడిదం హరీశ్‌(21)అలియాస్‌ చింటు, కూతురు నగేశ్‌(20) బైక్‌పై మల్లాపూర్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా చొప్పదండి శివారులో ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

నిరుపేద కుటుంబం...
నిరుపేద కుటుంబానికి చెందిన నగేశ్‌ జీవనోపాధి కోసం కరీంనగర్‌లోని మొబైల్‌షాపులో పనిచేస్తున్నాడు. నగేశ్‌ తల్లిదండ్రులు మరణించటంతో అన్న మహేశ్‌ వద్ద ఉంటున్నాడు. హరీశ్‌ తండ్రి మేసీ్త్ర పనిచేస్తుండగా హరీశ్‌ కూలీపనికి వెళ్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకుల మృతి అందరిని కంటతడిపెట్టించింది.

>
మరిన్ని వార్తలు