పూనం నామినేషన్‌ కార్యక్రమంలో శత్రుఘ్న సిన్హా

18 Apr, 2019 17:44 IST|Sakshi

లక్నో : బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ఎస్పీ తరపున లక్నో నుంచి పోటీ చేస్తున్న తన భార్య పూనం నామినేషన్‌ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శత్రుఘ్న సిన్హా బిహార్‌లోని పట్నాసాహిబ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కుటుంబ అనుబంధాలూ తనకు ముఖ్యమేనని, కుటుంబ యజమానిగా, భర్తగా తన కుటుంబానికి మద్దతు ఇవ్వడం తన బాధ్యతని శత్రుఘ్న సిన్హా తన చర్యను సమర్ధించుకున్నారు. కాగా 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిన్హా ప్రస్తుత ఎన్నికల్లో కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో తలపడుతున్నారు.

ఇక లక్నోలో సిన్హా భార్య పూనం ఎస్పీ తరపున పోటీ చేస్తూ ప్రత్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే లక్నోలో తన భార్య పూనం నామినేషన్‌కు శత్రుఘ్న సిన్హా హాజరవడం కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పడేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్‌ నేత, దిగ్గజ నటుడైన సిన్హా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు