ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలను సమర్థించిన శివసేన!

13 Jan, 2020 12:46 IST|Sakshi

ముంబై: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) భూభాగం భారత్‌ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే వ్యాఖ్యలను శివసేన సమర్థించింది. తుక్డే-తుక్డే గ్యాంగ్‌(వామపక్షాలు, వారికి మద్దతు తెలిపే వారిపై విమర్శల దాడి చేయడానికి బీజేపీ, రైట్‌ వింగ్‌ సభ్యులు తరచూ ఉపయోగించే పదం) అంటూ విమర్శలకు దిగే బదులు ఆర్మీ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చు కదా అని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఈ మేరకు..‘జనరల్‌ వ్యాఖ్యల్లో తప్పేం లేదు. పీఓకేలో చాలా వరకు ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. పాకిస్తాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందుకే నరవాణే కొత్త విధానాన్ని మేం స్వాగతిస్తున్నాం. 1994 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్‌, పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని పార్లమెంటు తీర్మానం చేసిందని నరవాణే చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తుక్డే తుక్డే గ్యాంగ్‌ అంటూ విమర్శలు చేయడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. దానికి బదులు ఆర్మీ చీఫ్‌నకు భారత్‌ పటం ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది’ అని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన కథనం వెలువరించింది.(పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం)

అదే విధంగా పీఓకేపై భారత్‌ జరిపిన మెరుపు దాడులను ప్రస్తావిస్తూ... ఎన్ని దాడులు జరిగినా పాకిస్తాన్‌ తన అలవాట్లను మార్చుకోలేదని శివసేన విమర్శించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కేంద్రం మంచి పని చేసిందని.. ఇప్పుడు నరవాణే కోరినట్లు పీఓకేపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘ మోదీ- షా నుంచి నరవాణేకు ఆదేశాలు అందిన వెంటనే పీఓకే మనదైపోతుంది. అప్పుడు అఖండ భారత్‌ను కోరుకున్న వీర్‌ సావర్కర్‌ విగ్రహం పూలమాలలతో నిండిపోతుంది. కాబట్టి ప్రధాని మోదీ వెంటనే నరవాణేకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. భారత ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు’ అని శివసేన కథనంలో పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు