మహా పాలిటిక్స్‌ : రాజకీయాల్లో ఎవరూ సన్యాసులు కాదు..

28 Oct, 2019 19:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో పాలనా పగ్గాలు చేపట్టడంపై బీజేపీ, శివసేనలు ఇంకా ఓ అవగాహనకు రాలేదు.  ప్రత్యామ్నాయాలను అన్వేషించే పరిస్థితి తమకు కల్పించవద్దని, రాజకీయాల్లో ఎవరూ సన్యాసులు కాదని బీజేపీకి శివసేన స్పష్టమైన సంకేతాలను పంపింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌, ఎన్సీపీల మద్దతు స్వీకరించడాన్ని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తోసిపుచ్చలేదు. కూటమి లక్ష్యాలకు శివసేన కట్టుబడి ఉంటుందని అంటూనే రాజకీయాల్లో ఏ పార్టీ సన్యసించదని కాషాయ పార్టీని ఆయన తనదైన శైలిలో హెచ్చరించారు.

బీజేపీ ప్రతిపాదన కోసం తాము వేచిచూస్తామని సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టంగా చెప్పారని..అయితే తమను ప్రత్యామ్నాయాల వైపు చూసే పరిస్థితి కల్పించవద్దని సంజయ్‌ మిత్రపక్షానికి సూచించారు. మహారాష్ట్రలో​ అధికారం పంచుకునేందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాపై శివసేన వెనక్కితగ్గడం లేదు. ఇరు పార్టీలు చెరి రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని ఆ పార్టీ బీజేపీని కోరుతోంది. అయితే రొటేషన్‌ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునేందుకు తాము సుముఖంగా లేమని బీజేపీ స్పష్టం చేసింది. సేన ఎమ్మెల్యేలు పలువురు ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రేను రెండున్నరేళ్ల పాటు సీఎంగా ప్రతిపాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు