నేనీ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు ఆయనే కారణం!

28 Oct, 2019 19:58 IST|Sakshi

ఢిల్లీ : ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీనీ టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌  పొగడ్తతలతో ముంచెత్తాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా రాణించడంలో దాదా పాత్ర మరువలేనిదని పేర్కొన్నాడు. కెరీర్‌ బిగినింగ్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో ఆడుతున్న తనను గంగూలీ గుర్తించి ఓపెనర్‌గా పంపించకపోయుంటే క్రికెట్‌ ప్రపంచంలో సెహ్వాగ్‌ పేరు ఎవరికీ గుర్తుండేది కాదని మీడియాతో వెల్లడించాడు.

‘ప్రాక్టీస్‌ సందర్భంలో నీకు ఓపెనర్‌గా ప్రమోషన్‌ ఇద్దామనుకుంటున్నా అని గంగూలీ నా వద్దకు వచ్చి చెప్పాడు. దానికి నువ్వే ఓపెనర్‌గా ఆడొచ్చుగా అని బదులిచ్చా. ప్రస్తుతం ఓపెనర్‌ స్థానం ఖాళీగా ఉంది. అందుకే మొదట ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నీకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇస్తాను. ఒకవేళ ఓపెనర్‌గా ఫెయిలైనా మిడిల్ఆర్డర్‌లో నీ స్థానానికి ఢోకా ఉండదని దాదా చెప్పాడు' అని సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఓపెనర్‌ అవకాశం ఇవ్వడం వల్లే తాను రాణించానని, తరువాతి 12 ఏళ్లు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం తనకు రాలేదని తెలిపాడు.

1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్ కొన్ని రోజులు మిడిల్‌ ఆర్డర్‌లో ఆడిన సంగతి తెలిసిందే. 2001లో శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్‌ సెహ్వాగ్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది. సచిన్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సెహ్వగ్‌ న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్‌.. అజహర్‌, యువరాజ్ సరసన నిలిచాడు. ఇక అక్కడి నుంచి సెహ్వాగ్‌కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు(వన్డే, టెస్టు, టీ20) ఫార్మాట్‌లు కలిపి 17వేలకుపైగా పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టు తరపున రెండుసార్లు ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్‌ ఘనత సాధించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా