ఎస్పీ- బీఎస్పీ పొత్తుపై స్పందించిన శివపాల్‌ యాదవ్‌

17 Jan, 2019 17:47 IST|Sakshi

లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గతంలో బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.  2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలు చెరో 38 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఎస్పీ- బీఎస్పీ పొత్తుపై అఖిలేశ్‌ యాదవ్‌ బాబాయ్‌ (ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు), సమాజ్‌వాది సెక్యులర్‌ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ స్పందించారు.

ఉత్తరప్రదేశ్‌లోని చందోలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న శివపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత్రి మయావతిని నమ్మడం అంత శ్రేయస్కరం కాదని అఖిలేశ్‌ యాదవ్‌కు సూచించారు. ఈ క్రమంలో 1995 నాటి ‘లక్నో గెస్ట్‌హౌజ్‌ ఘటన’ ను ప్రస్తావించిన ఆయన..‘ బెహన్‌జీ(మాయవతి) నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ సమయంలో విచారణ ఎదుర్కొనేందుకు, అవసరమైతే నార్కో అనాలిసిస్‌ టెస్టుకు కూడా సిద్ధమని నేను చెప్పాను. అదేవిధంగా మాయావతి కూడా నాలాగే నార్కో టెస్టు చేయించుకోవాలని కోరాను. కానీ ఆమె అందుకు నిరాకరించారు. టిక్కెట్లు అమ్ముకునే అలాంటి వ్యక్తులను నమ్మకూడదు. నేతాజీ(ములాయం)ని గూండా అంటూ దూషించిన ఆమెను ఎలా నమ్ముతారు. ఆమె ఎక్కువ సీట్లు గెలుచుకోలేరు’ అని వ్యాఖ్యానించారు.

1995లో ఏం జరిగింది?
1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఈ క్రమంలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం చాశారు.

శివ్‌పాల్‌ యాదవ్‌

మరిన్ని వార్తలు