శరద్‌​ పవార్‌, మాయావతిపై శివసేన విమర్శలు

22 Mar, 2019 15:21 IST|Sakshi

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారానికి పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం శివసేన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వారిద్దరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పడం..నరేంద్ర మోదీ మరోసారి  ప్రధాని కావడానికి సంకేతమని  అభిప్రాయపడింది. ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నాలో మాయావతి, శరద్‌ పవార్‌ల తీరును విమర్శిస్తూ శివసేన కథనం ప్రచురించింది.

‘తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి ప్రధాని రేసు నుంచి తప్పుకొంటున్నట్టు శరద్‌ పవార్‌, మాయావతి స్పష్టం చేశారు. బీఎస్పీ అభ్యర్థులను గెలిపించేందుకు మాయావతి కృషి చేస్తారట. అందుకే పోటీ చేయడం లేదని చెప్పారు. దళితుల పార్టీగా చెప్పుకొనే బీఎస్పీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. దళితులు, యాదవులు గంపగుత్తగా మోదీకే ఓటు వేశారు. ఆ చేదు అనుభవానికి సంబంధించిన మరక ఈ నాటికీ మాయావతిని వెంటాడుతోంది.నిజానికి ఉత్తరప్రదేశ్‌లో తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ బీఎస్పీకి ఆదరణ లేదు. బహుషా ఈ విషయాన్ని గుర్తెరిగినందు వల్లే ఆమె ఎన్నికల బరి నుంచి పారిపోయారు. అదే విధంగా ప్రస్తుతం ప్రియాంక గాంధీ రూపంలో బీఎస్పీకి మరో ముప్పు పొంచి ఉంది. ప్రియాంక ‘పర్యాటక యాత్ర’ కు వస్తున్న కొద్దిపాటి స్పందన మాయావతిని భయపెడుతోంది. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య పోటీ చేయరాదని బహుషా బెహన్‌ జీ భావించారేమో. అందుకే ఈ నిర్ణయం’ అంటూ ఎద్దేవా చేసింది.(నేను పోటీ చేయను)

ముందు కుటుంబాన్ని చక్కదిద్దుకోండి..!
‘ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పాపం చాలా ప్రయత్నించారు. కానీ తన కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలనే ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారు. ఆయన పార్టీ వాళ్లు బీజేపీలో చేరుతుండటం ఎన్సీపీకి పెద్ద ఎదురుదెబ్బే. ముఖ్యంగా రంజిత్‌సిన్హా మోహిత్‌ పాటిల్‌ వంటి ముఖ్య నాయకులు పార్టీని వీడటం ద్వారా ఎన్సీపీ బలహీనపడుతుంది. అందుకే శరద్‌ పవార్ కూడా‌ మాయావతి మార్గాన్నే అనుసరించారు. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తెలిసి పోటీ నుంచి తప్పుకొన్నారు’ అని శరద్‌ పవార్‌పై శివసేన విమర్శలు గుప్పించింది.

మరిన్ని వార్తలు