నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్‌

4 Dec, 2019 11:46 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్‌ శివన్‌ వ్యతిరేకించారు. చంద్రయాన్‌-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని పేర్కొన్నారు. ‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్‌ విక్రమ్‌ ల్యాండర్‌ జాడను ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్‌సైట్‌లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్‌ చేసుకోండి’ అని శివన్‌ అసహనం వ్యక్తం చేశారు. కాగా సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయపడటంతో విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని నాసా పేర్కొంది. (చదవండి: ఎట్టకేలకు ‘విక్రమ్‌’ గుర్తింపు)

ఇక ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌-2 నింగికి ఎగిరిన విషయం విదితమే. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్‌-2 నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే సెప్టెంబర్‌ 7న చివరిక్షణంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్‌ అవడానికి బదులు కొంత ఎత్తు నుంచి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది.  చంద్రయాన్‌-2 విక్రమ్‌ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్‌ చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్‌ 17న ఎల్‌ఆర్‌ఓ తీసిన కొన్ని ఛాయాచిత్రాలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్‌ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్‌ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నై మెకానికల్‌ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ (33) తన ప్రయత్నం చేశారు. అయితే శివన్‌ మాత్రం నాసా ప్రకటనను ఖండించడం గమనార్హం.

మరిన్ని వార్తలు