ఎస్సీ, ఎస్టీలది వెనుకబాటే!

17 Jan, 2019 01:49 IST|Sakshi

జాతీయ ఆదాయ సగటుకన్నా తక్కువ సంపాదన

ఓబీసీలు, ముస్లింలు కాస్త పర్వాలేదు

పదేళ్లలో 30% పెరిగిన ధనవంతుల ఆర్జన

‘10% రిజర్వేషన్‌’ నేపథ్యంలో అసమానతలపై మొదలైన చర్చ  

భారతీయ సమాజంలో మొదట్నుంచీ ఆర్థిక, సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే.. కొంతకాలంగా అగ్రవర్ణ పేదలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన (ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా) వర్గాలకు 10% రిజర్వేషన్లు వర్తింపచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓ బిల్లు తీసుకొచ్చింది. ఈ 10% పరిధిలోకి అగ్రవర్ణ పేదలతోపాటు మైనార్టీలూ వస్తారు. చర్చోపచర్చల అనంతరం పార్లమెంటులో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ కులాల మధ్య ఆదాయ అసమానతల తీరుతెన్నులపై ఓ చిన్న విశ్లేషణ.   
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

వరల్డ్‌ ఇనీక్వాలిటీ డేటాబేస్‌.. 
‘భారతదేశ సంపదలో అసమానతలు – కులం, వర్గం – 1961 నుంచి 2012’ శీర్షికన వెలువడిన ఓ పత్రం ప్రకారం.. కొన్ని సామాజిక వర్గాలు జాతీయ సగటు కంటే దాదాపు 47% ఎక్కువ సంపాదించినట్టు వెల్లడైంది. వీరిలోనూ 10% కుటుంబాలు 60% సంపదను వెనకేసుకున్నట్టు ‘వరల్డ్‌ ఇనీక్వాలిటీ డేటాబేస్‌’ఇటీవల వెలువరించింది. జనాభాలో ఒక శాతంగా వున్న అత్యధిక ధనవంతుల ఆర్జన పదేళ్ల కాలంలో (2002–2012) దాదాపు 16% నుంచి 29.4% పెరిగింది. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర వర్గాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో.. వివిధ కులాల మధ్య ఆదాయపరమైన అసమానతలపై మరోసారి చర్చ మొదలైంది. గత 36 ఏళ్లలో (2016 నాటికి) అన్ని కులాల్లోనూ ఈ వ్యత్యాసాలు పెరుగుతూ వచ్చాయని జాతీయ శాంపిల్‌ సర్వే, రుణ–పెట్టుబడుల సర్వే, భారతీయ మానవాభివృద్ధి సర్వే, వివిధ సంపద సర్వేలు, మిలియనీర్ల జాబితా తదితరాలను విశ్లేషించి రూపొందించిన ఈ పత్రం వివరించింది. అగ్రవర్ణాల్లో అందరి స్థితీ మెరుగ్గా వుందని చెప్పలేమని.. అలాగని అన్ని సామాజిక తరగతులను ఒకే సమూహం కిందికి తీసుకురావడం సరి కాదని ఈ పత్రం పేర్కొంది. 

జాతీయ సగటుకు తక్కువగానే..
వరల్డ్‌ ఇనీక్వాలిటీ డేటాబేస్‌ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు జాతీయ సగటు (రూ.1,13,222)తో పోల్చుకుంటే చాలా తక్కువ సంపాదిస్తున్నారు. జాతీయ సగటు కంటే ఎస్సీలు 21%, ఎస్టీలు 34% తక్కువ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఓబీసీలుæ వీరి కంటే కాస్త మెరుగ్గా సంపాదిస్తున్నప్పటికీ అది జాతీయ సగటు కంటే 8% (రూ.9,123) తక్కువగానే ఉంది. ముస్లిం ఆదాయం జాతీయ సగటు కంటే 7% తక్కువగా ఉంది. దేశంలోని మొత్తం సంపదలో 55% పది శాతంగా ఉన్న సంపన్నుల గుప్పెట వుందని 2018 ప్రపంచ అసమానతల నివేదిక చెబుతోంది. గత 18 ఏళ్లలో వీరి సంపద 24% పెరిగింది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 45.9% ఎస్టీలు అల్పాదాయ శ్రేణిలో వున్నారు. ఎస్సీల్లో 26.6%, ఓబీసీల్లో 18.3%, ఇతర కులాల్లో 9.7% మంది స్పల్ప ఆదాయంతోనే బతుకులీడుస్తున్నారు. కులం వివరాలు వెల్లడికాని మరో 25.3% మందిదీ ఇదే పరిస్థితి.

మరిన్ని వార్తలు