పూరి గుడిలో... స్మార్ట్‌ నిషేధం

20 Dec, 2017 09:09 IST|Sakshi

-జనవరి నెల 1 నుంచి అమలు

సాక్షి, భువనేశ్వర్‌/పూరీ: ఎట్టకేలకు పూరీ జగన్నాథుని దేవస్థానంలోనికి స్మార్ట్‌ ఫోన్ల ప్రవేశాన్ని నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమలవుతుందని జగన్నాథ మందిరం అథారిటీ ప్రకటించింది. సామాన్య భక్తులు, యాత్రికులతో పాటు అతిరథ మహారథులకు కూడా ఈ నిషేధం వర్తింపజేస్తామని జగన్నాథ మందిరం అథారిటీ సేవల విభాగం పాలన అధికారి ప్రదీప్‌ దాస్‌ తెలిపారు. భక్త వర్గంలో స్వామికి నిత్య సేవలు అందజేసే సేవాయత్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు వగైరా వర్గాలకు కూడా స్మార్ట్‌ ఫోన్ల నిషేధం కట్టుదిట్టంగా అమలుచేస్తామని  ప్రకటించారు.

సేవాయత్‌లకు స్వల్ప మినహాయింపు
 దైనందిన సేవలు కల్పించే సేవాయత్‌లకు స్వల్ప మినహాయింపు కల్పించారు. కెమెరా సదుపాయం లేని సాధారణ మొబైల్‌ ఫోన్‌ను వారికి అనుమతిస్తారు. ఈ సాంకేతిక వ్యవస్థను పరిశీలించి ధ్రువీకరించిన ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. శ్రీ మందిరం ప్రాంగణంలోకి అనుమతించే సాధారణ మొబైల్‌ ఫోన్లపై నీల చక్ర లోగో ముద్రిస్తారు. శ్రీ మందిరం దేవస్థానం త్వరలో సీయూజీ ఫోన్‌ వ్యవస్థను ప్రవేశ పెడుతుంది. దేవస్థానం ప్రాంగణంలో సేవాయత్‌ల కోసం సీయూజీ ఫోన్‌ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాల్లో విక్రయించే మొబైల్‌ ఫోన్లు ముందు, వెనక నీలచక్ర లోగో స్పష్టంగా కనిపిస్తుంది. తనిఖీ వర్గాలకు ఈ సదుపాయం సహకరిస్తుంది. మొబైల్‌ ఫోనులో సిమ్‌ స్థిరంగా ఉంటుంది. కొనుగోలు చేసిన సేవాయత్‌ లేదా అధికారి పూర్తి వివరాల్ని నమోదు చేస్తారు. ఇలా దేవస్థానం ధ్రువీకరించిన మొబైల్‌ ఫోన్లు మినహా ఇతర స్మార్ట్‌ ఫోన్లు గుర్తిస్తే స్వాధీనం చేసుకోవడం తథ్యమని అధికారులు స్పష్టం చేశారు.

భద్రతకు ముప్పు రాకూడదని 
 శ్రీ మందిరం దేవస్థానం లోపలి ప్రాంగణాల్లో ఫొటోలు, వీడియో చిత్రీకరణ ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో విస్తారంగా ప్రసారమైం‍ది. ఈ ప్రసారం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఆలయ భద్రతకు ఇటువంటి ప్రసారం ముప్పు తీసుకువస్తుందనే యోచనను శ్రీ మందిరం భద్రతా విభాగం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం దేవస్థానం ప్రాంగణం లోనికి స్మార్ట్‌ ఫోన్లను అనుమతించరాదని నిర్ణయించారు.    

>
మరిన్ని వార్తలు