చిన్న కష్టానికే అంతగా చలించిపోవడమా!!!

29 Jul, 2018 01:33 IST|Sakshi

కలాం కలలు

అమ్మ తిట్టింది...ఆత్మహత్య! ఒక్క మార్కు తక్కువొచ్చింది... ఆత్మహత్య!... ప్రతి చిన్నదానికీ ఏదో నిరాశ.. చేతిలోంచి జారిపడిన మట్టిముద్ద నేలపాలవుతుంది. మళ్ళీ లేవదు. అదే బంతి కిందపడితే వెంటనే పైకి లేస్తుంది. విద్యార్థులుగా మీరు నిభాయించుకోగలగాలి. తప్పయితే క్షమించండని అడగాలి. ఒప్పయితే ఒప్పని నిలబడాలి. ఒక్క మార్కు తక్కువొస్తే వచ్చేసారి కాలేజి ఫస్ట్‌ రా, యూనివర్శిటీ ఫస్ట్‌ రా...అదీ సాధన. అప్పడు నీవు చరిత్రకెక్కుతావు. ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీ...ఒకనాడు తండ్రికి భారం కాకూడదని 20 కి.మీ. నడిచివెళ్ళి చదువుకుంది. ఐఏఎస్‌కి ప్రయత్నించింది. ఐపిఎస్‌కు ఎంపికయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపిఎస్‌ అధికారిగా రికార్డుకెక్కింది. ఇందిరాగాంధీ ఆమెకు ఆదర్శ మహిళ. ప్రధానమంత్రిగా శ్రీమతి గాంధీ ఉన్న కాలంలో జరిగిన ఏషియాడ్‌ క్రీడలప్పుడు ట్రాక్‌ ఇంచార్జిగా కిరణ్‌ బేడీని నియమించారు. ఒకరోజు విధుల్లో ఉండగా ట్రాక్‌ దగ్గర ప్రధానమంత్రి కారు ట్రాఫిక్‌ నియమాలకు విరుద్ధంగా పార్క్‌ చేసి ఉంది. అది ప్రధానమంత్రి కారు అని చెబుతున్నా పట్టించుకోకుండా క్రేన్‌తో వ్యాన్‌లో పెట్టించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించింది. సామాన్యుడికి ఒక రూలు, ప్రముఖులకు మరో రూలా? ససేమిరా అంగీకరించేది కాదు. నియమోల్లంఘన జరిగితే ఎవరినీ లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినందుకు చరిత్రలో బహుశా ఆమె పొందినన్ని బదిలీలు మరెవరూ పొంది ఉండలేదేమో. అయినా సరే. వెనకడుగు వేయలేదు. ఒకసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఏర్పాట్లను అత్యుత్తమంగా నిర్వహించినందుకు ఇందిరాగాంధీ ఆమెను ఆహ్వానించి తనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించారు.

కక్షసాధింపు బదిలీల్లో భాగంగా ఒకసారి ఆమెను తీహార్‌ జైలుకు డీజీగా పంపారు. ఒక్క తప్పుచేసి జీవితంలో ఇక్కడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉత్తములుగా బతకాలని ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి ఆమె దానిని అతి కొద్దికాలంలోనే ఆశ్రమంగా మార్చేసారు. అక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఆమె ఒక పుస్తకాన్ని రాసారు. ఆ రోజున ఆమె ఉన్న స్థాయికి ప్రధానమంత్రిని అడిగినా వెళ్ళి ఆవిష్కరించి ఉండేవారు. కానీ పేరు మోసిన నేరస్థుడు, ఖైదీ ఛార్లెస్‌ శోభారాజ్‌తో ఆవిష్కరింపచేసారు. ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఆవిడకేం ఒక్క రోజులో రాలేదు. జీవితంలో అన్ని కష్టసుఖాలకు ఓర్చి నిలబడింది. ఒక సంకల్పంపెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి. అంతపెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మిగారు ఒక కచ్చేరీ చేయాలంటే ఆరుగంటలు సాధన చేసి వెళ్ళేవారు. అదీ నిబద్ధత. దాన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. అబ్దుల్‌ కలాం మంచి దార్శనికుడు. ఫెయిల్‌ (ఊఅఐఔ) అన్నమాటకు కొత్త నిర్వచనం చెప్పాడు. ఫస్ట్‌ అటెంప్ట్‌ ఇన్‌ లెర్నింగ్‌ (ఊజీటట్ట అ్ట్ట్ఛఝp్ట ఐn ఔ్ఛ్చటnజీnజ) అంటే నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నం చేసినవాడు.. అని. విఫలమయితే నిరాశపడకూడదు. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లే... మరోసారి ప్రయత్నించు. ‘‘నా దేశ విద్యార్థులు ఆ స్థాయిని అందుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి.  వాళ్ళ వ్యక్తిత్వం పువ్వు వికసించినట్లు రేకురేకుగా వికసనం పొందాలి. వాళ్ళు అటువంటి ఆత్మ స్థయిర్యం పొందాలి.’’ అని కలాం కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేయడమే ఆయనకు మీరు అర్పించే నివాళి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు