గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించేవాడు : సుబ్రమణ్య స్వామి

29 Jan, 2019 11:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఫెర్నాండెజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్‌కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు.

ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్‌ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్‌ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్‌ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్‌ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు.

అంతేకాక ఫెర్నాండెజ్‌ బోఫోర్స్‌ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. కానీ వాజ్‌పేయ్‌ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. అంతేకాక సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్‌ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు