భయంకరంగా రాజకీయాలు : ఉత్తమ్‌

29 Jan, 2019 11:22 IST|Sakshi

సాక్షి, చింతలపాలెం (హుజూర్‌నగర్‌) : రానురాను రాజకీయాలు భయంకరంగా మారిపోతున్నాయని టీపీసీసీ చీఫ్, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని దొండపాడు, వజినేపల్లి, గాంధీనగర్‌తండా, గుడిమల్కాపురం, చింతలపాలెం గ్రామాల్లో ఆయన కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థుల తరఫున సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పేద ప్రజలు, సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకుండా పోతోందని, అంతా ధన రాజకీయం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించి ఓటు వేయాలని కోరారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాలని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారీటీతో గెలిపిస్తే పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఉత్తమ్‌ పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నాయకుల బెది రింపులకు భయపడవద్దని ఆ నాయకుల మాటలు పట్టించుకోవద్దని చెప్పారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఉత్తమ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా వీరారెడ్డి, పుల్లారెడ్డి, గున్నం నాగిరెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, రాములు నాయక్, సీతారెడ్డి, ఉస్తేల నారాయణరెడ్డి, ఉస్తేల సజన, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డులకు పోటీలో ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు