పురోహిత్‌ పిటిషన్‌పై స్పందించండి: సుప్రీంకోర్టు

29 Jan, 2018 21:25 IST|Sakshi
పోలీసులతో నిందితుడు శ్రీకాంత్‌ పురోహిత్‌ (ఫైల్ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితుడు లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారిక అనుమతులు రాకుండానే ఈ కేసులో ఎన్‌ఐఏ తనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసు నమోదు చేసిందని ఆరోపించారు. కాబట్టి ఈ కేసులో దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించాడు. దీనిపై ఆర్కే అగర్వాల్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పందిస్తూ ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని మహారాష్ట్రను ఆదేశించింది.

అయితే దిగువకోర్టు నిర్ణయంపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇదే విషయమై గతంలో పురోహిత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో నిందితుడిపై మోకా చట్ట ప్రకారం దాఖలైన సెక్షన్లను తోసిపుచ్చిన దిగువకోర్టు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం మాత్రం విచారణ కొనసాగుతుందని గత డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్లలో పలువురు మరణించిన విషయం తెలిసిందే.

      
 

మరిన్ని వార్తలు