జస్టిస్‌ కర్ణన్‌పై అరెస్ట్‌ వారెంట్‌

11 Mar, 2017 00:52 IST|Sakshi
జస్టిస్‌ కర్ణన్‌పై అరెస్ట్‌ వారెంట్‌

కోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన సుప్రీంకోర్టు
► రాజ్యాంగ విరుద్ధమన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
►  సీజేఐపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు


న్యూఢిల్లీ/కోల్‌కతా: కోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్ కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. ఈ నెల 31 ఉదయం కర్ణన్ ను కోర్టు ముందు హాజరు పరచాలని పశ్చిమబెంగాల్‌ డీజీపీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఆదేశించింది. రూ.10 వేల పూచీకత్తుపై కర్ణన్  బెయిలు పొందవచ్చని సూచించింది.

సర్వీసులో ఉన్న హైకోర్టు న్యాయమూర్తికి అరెస్టు వారెంటు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ‘కోర్టు ఆదేశించినా కర్ణన్  వ్యక్తిగతంగాగానీ, తన లాయర్‌ ద్వారాగానీ హాజరు కాలేదు. వారంట్‌కు తప్ప వేరే మార్గంలేదు’ అని సీజేఐ, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్  గొగోయ్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ పీసీ ఘోస్, జస్టిస్‌ కురియన్  జోసెఫ్‌ల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

ఆదేశాలు బేఖాతరు...
మద్రాస్‌ హైకోర్టులోని కొందరు ప్రస్తుత, విశ్రాంత జడ్జీలు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని, సీజేఐలకు కర్ణన్  లేఖలు రాశారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఫిబ్రవరి 8న కోర్టు ముందు హాజరై, వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం నోటీసు లిచ్చింది. ఆయన హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 13న హాజరు కావాలంటూ మరో నోటీసిచ్చింది. ఈ ఆదేశాలనూ జస్టిస్‌ కర్ణన్  బేఖాతరు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సిట్టింగ్‌ హైకోర్టు జడ్జిపై చర్యలు తీసుకొనే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, ఈ విషయాన్ని ముందుగా పార్లమెంటుకు రిఫర్‌ చేయాలని పేర్కొంటూ ఫిబ్రవరి 10న సీజేఐకు జస్టిస్‌ కర్ణన్  లేఖ రాశారు.

సుప్రీం అధికార దుర్వినియోగంపై విచారణ జరపండి
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 ప్రకారం.. జస్టిస్‌ ఖేహర్‌తో పాటు ధర్మాసనంలోని మరో ఆరుగురు జడ్జీలపై కేసు నమోదు చేసి, విచారణ జరపాల్సిందిగా.. జస్టిస్‌ కర్ణన్  సీబీఐని ఆదేశిస్తూ శుక్రవారం మీడియా ముందే సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. దర్యాప్తు నివేదికను సంబంధిత సీబీఐ కోర్టు ముందుంచాలన్నారు.

సర్వోన్నత న్యాయస్థానం అధికార దుర్వినియోగంపై విచారణ జరపాలని సూచించారు. అలాగే దీనికి సంబంధించి సరైన విచారణ జరిగేలా పూర్తి సాక్ష్యాధారాలను స్పీకర్‌ ముందుంచాలని ఈ కేసుకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు సూచించినట్టు తెలిపారు. దీంతోపాటు తనపై అరెస్ట్‌ వారంట్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతున్నానని, తనకెలాంటి పోర్టుఫోలియో ఇవ్వకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని అభ్యర్థిస్తున్నానని చెప్పారు.

‘జస్టిస్‌ కర్ణన్  తీరు బాధాకరం’
కర్ణన్‌ కోర్టులో వ్యవహరించిన తీరుపై ‘న్యాయ’లోకం ఆవేదన వ్యక్తం చేసింది. జడ్జిలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటం సరికాదంటూ  కర్ణన్  వాదించటం న్యాయవ్యవస్థను అవమానించేలా ఉందని అభిప్రాయపడింది. మాజీ అటార్నీ జనరల్‌ సొలీ సొరాబ్జీ కర్ణన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని, ఒక జడ్జి ఇలాంటి వ్యాఖ్య లు చేయటం బాధాకరమన్నారు.

దళితుడిని కావడం వల్లనే..: జస్టిస్‌ కర్ణన్
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఇచ్చిన అరెస్ట్‌వారంట్‌పై జస్టిస్‌ కర్ణన్  స్పందించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, తనకు అరెస్ట్‌వారంట్‌ ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి లేదన్నారు. దళితుడిని కావడం వల్లనే తనపై ఈ దాడిచేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని శుక్రవారం కోల్‌కతాలో ఆరోపించారు. మద్రాస్‌ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని ప్రధానికి లేఖ రాయడం వల్లనే తనపై ఈ కక్ష సాధింపన్నారు.

‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 20 కోర్టు ధిక్కరణ చట్టం 2(సీ), 12, 14 సెక్షన్ల కింద హైకోర్టు సిట్టింగ్‌ జడ్జికి అరెస్ట్‌ వారంట్‌ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. దళితుడిని కావడం వల్లనే నాపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు’ అని జస్టిస్‌ కర్ణన్  పేర్కొన్నారు. సిట్టింగ్‌ హైకోర్టు జడ్జీలపై చర్యలు తీసుకోవాలంటే.. న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారం సమగ్ర దర్యాప్తు తరువాత పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టడమొక్కటే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమన్నారు.

మరిన్ని వార్తలు