జడ్జీల పేరుతో లంచాలు!

10 Nov, 2017 02:17 IST|Sakshi

విచారించనున్న ఐదుగురు సభ్యుల బెంచ్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల పేరుతో కొందరు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. నవంబర్‌ 13న ఇది విచారణకు వస్తుందని పేర్కొంది. కొత్త ప్రవేశాలు చేపట్టకుండా నిషేధం ఎదుర్కొంటున్న ఓ మెడికల్‌ కాలేజీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా ముడుపులుచేతులు మారుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐర్‌ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ కాలేజీ వైద్య ప్రవేశాల కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ విచారిస్తోందని, కాబట్టి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయనకు స్థానం కల్పించొద్దని న్యాయవాది దుష్యంత్‌ దవే కోరారు. ‘ఈ ఆరోపణలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. తాజా పరిస్థితులన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ విషయంపై విచారణ జరపడానికి సీనియారిటీ ప్రాతిపాదికన తొలి ఐదు స్థానాల్లో ఉన్న జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం’ అని జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ఉన్నత న్యాయ వ్యవస్థ గౌరవానికి సంబంధించిన ఈ వ్యవహారం విచారణలో భాగంగా సీబీఐ సేకరించిన కీలక పత్రాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని దవే ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు