‘పీఎం మోదీ’పై స్టేకు నో

10 Apr, 2019 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ’సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాకుండానే విడుదలపై స్టే ఇవ్వాలని కోరడం తగదంది. ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఎలక్షన్‌ కమిషన్‌ను ఆశ్రయించమని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో బీజేపీకి అనుకూలించే అంశాలు ఉంటే ఎలక్షన్‌ కమిషన్‌ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ బయోపిక్‌ విడుదలను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై సోమవారం విచారణ జరుపుతున్న క్రమంలో మోదీ బయోపిక్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సదరు సన్నివేశాల వీడియో క్లిప్పింగులను తమ ముందుంచాలని కోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ వీడియోలను ప్రవేశపెట్టడంలో పిటిషనర్‌ విఫలమయ్యారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేవలం రెండు నిమిషాల ట్రైలర్‌ను చూసి సినిమా విడుదలను నిలిపివేయాలని కోరడం తగదని వ్యాఖ్యానించింది.    

మరిన్ని వార్తలు