రఫేల్‌పై వాడివేడీ వాదనలు.. తీర్పు రిజర్వు

10 May, 2019 17:06 IST|Sakshi

సాక్షి: న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాడీవేడిగా జరిగింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు అటర్నీ జనరల్‌ ధర్మసనానికి వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పిటిషనర్ల తరుఫున తొలుత వాదనలు వినిపించిన ప్రశాంత్‌ భూషణ్‌ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలోని నిజనిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అటర్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి.. జెట్ల ధరలను బహిర్గతం చేయలేమని అన్నారు. పిటిషనర్లు ప్రతిసారి ధరల గురించి ప్రస్తావించడం సరైనది కాదని అసహనం వ్యక్తంచేశారు.  ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు తమకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.

కాగా రాఫెల్‌పై పిటిషన్‌ దాఖలు చేసిన మరో పిటిషనర్‌ అరుణ్‌ శౌరి న్యాయస్థానం ఎదుట తన వాదనల్ని విన్పించారు. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు. ఇప్పటికే కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే సుప్రీంకోర్టు గత తీర్పు ఇచ్చిందని న్యాయస్థానం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు