తన ఆదేశాలపైనే స్టే ఇచ్చుకున్న ‘సుప్రీం’

1 Mar, 2019 02:44 IST|Sakshi

అడవుల్లో అక్రమంగా ఉండే వారిని పంపించేయాలంటూ ఫిబ్రవరిలో ఆదేశాలు 

కేంద్ర ప్రభుత్వ మధ్యంతర దరఖాస్తుతో తాజా పరిణామం

నివాసితుల దరఖాస్తుల తిరస్కరణపై అఫిడవిట్‌ వేయాలంటూ రాష్ట్రాలకు నోటీసులు 

సాక్షి, న్యూఢిల్లీ : అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)–2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.

అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75 ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగకపోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదా అనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది.

‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్‌ అయిన వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వ తేదీకి వాయిదావేసింది. 

మరిన్ని వార్తలు