‘ట్రిపుల్‌ తలాక్‌’ చెత్త విధానం

13 May, 2017 08:27 IST|Sakshi
‘ట్రిపుల్‌ తలాక్‌’ చెత్త విధానం

సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్‌ తలాక్‌ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ట్రిపుల్‌ తలాక్‌ చట్టబద్ధమేనని కొన్ని ఇస్లాం మత శాఖలు చెబుతున్నప్పటికీ అతి చెత్త విధానమని చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం రెండో రోజు విచారణలో పేర్కొంది.

ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్‌ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ నివేదించడంతో ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఈ తలాక్‌ విధానంపై నిషేధం ఉన్న ఇస్లామిక్, ఇస్లామిక్‌యేతర దేశాల జాబితాను రూపొందించాలని ఆయనను కోరింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌కు అనుమతి లేదని ఖుర్షీద్‌ తెలిపారు.

తలాక్‌ బాధితుల తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తూ.. ఈ విధానం సమానత్వ హక్కుతోపాటు పలు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. ‘ట్రిపుల్‌ తలాక్‌ చెప్పే అవకాశం భర్తకే ఉంది కానీ భార్యకు లేదు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘించడమే. కాగా, ట్రిపుల్‌ తలాక్‌ మహిళల హక్కుల అంశమైనప్పటికీ.. సుప్రీం బెంచ్‌లో మహిళా జడ్జి లేకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ లలితా కుమారమంగళం ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు