ఆకాశ్.. అన్ని పరీక్షలూ పాస్!

19 Jun, 2014 02:37 IST|Sakshi
ఆకాశ్.. అన్ని పరీక్షలూ పాస్!

* గగనతలంలో చిన్న యూఏవీనీ ధ్వంసం చేసిన క్షిపణి
* సైన్యం అమ్ములపొదికి చేరేందుకు ఇక సిద్ధం

 
 న్యూఢిల్లీ: గగనతలంలో శత్రు విమానాలను తుత్తునియలు చేయగల ఆకాశ్ క్షిపణి ఎట్టకేలకు సైన్యం అమ్ములపొదికి చేరేందుకు సిద్ధమైంది. రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) రూపొందించిన ఆకాశ్ క్షిపణిని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. బుధవారం సరిహద్దు వద్ద నిర్వహించిన పరీక్షలో గగనతలంలో 30 మీటర్ల ఎత్తులోనే ఎగురుతున్న బన్షీ అనే చిన్న మానవరహిత వాహనం(యూఏవీ)ని తక్కువ ఎత్తులోనే ఎగురుతూ వె ళ్లి ఆకాశ్ ధ్వంసం చేసిందని డీఆర్‌డీవో అధికారులు ప్రకటించారు.
 
  దీంతో సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైతం ఆకాశ్ ధ్వంసం చేయగలదని నిరూపణ అయిందని, తాజా పరీక్షతో అన్ని రకాల పరీక్షల్లోనూ ఆకాశ్ సత్తా చాటినట్లైందని వెల్లడించారు. ఆకాశ్ శక్తి, సామర్థ్యాల నిర్ధారణకు సైన్యం నిర్వహించిన ఆఖరు పరీక్ష ఇదని, దీంతో ఆకాశ్ సూపర్‌సోనిక్ క్షిపణులను సైన్యానికి అందించేందుకు మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సైన్యం, అధికారులకు ఆ సంస్థ చీఫ్ అవినాశ్ చందర్ అభినందనలు తెలియజేశారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతోనే గగనతల రక్షణ సాంకేతికతలను సమకూర్చుకోవడంలో ఆకాశ్ కీలక మైలురాయి అని ఆయన అన్నారు. ఈ క్షిపణిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను డీఆర్‌డీవో రెండు దశాబ్దాలుగా అభివృద్ధిపరుస్తోంది. సుమారు 30 మీటర్ల నుంచి 18 కి.మీ. ఎత్తులో, 30 కి.మీ. దూరంలోపు ఎగురుతున్న శత్రు యుద్ధవిమానాలను, యూఏవీలను, హెలికాప్టర్‌లను ఆకాశ్ క్షిపణి ధ్వంసం చేయగలదు.

>
మరిన్ని వార్తలు