రాహుల్... పగ్గాలు అందుకోండి!

8 Nov, 2016 01:43 IST|Sakshi
రాహుల్... పగ్గాలు అందుకోండి!

ముక్తకంఠంతో కోరిన సీడబ్ల్యూసీ
 
 న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో.. ‘పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉండాలి’ అంటూ సభ్యులు ముక్తకంఠంతో రాహుల్‌ను కోరారు. 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ సారథ్యానికి ఆయనే అన్ని విధాలా అర్హుడని తేల్చిచెప్పారు.  పార్టీలో నిర్ణయాధికారం కలిగిన సీడబ్ల్యూసీలో దీనిపై చర్చ జరగడం తొలిసారి. సీనియర్ నేత ఏకే ఆంటోనీ తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని మన్మోమోహన్‌సింగ్‌తో పాటు సీనియర్ నేతలందరూ ఏకగ్రీవంగా సమర్థించారు. ‘రాహుల్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాలని కోరుకుంటున్న కోట్లాది మంది కార్యకర్తల అభీష్టాన్ని సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

అందుకు ఇదే సరైన సమయం. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై అన్ని వర్గాలనూ చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లే సత్తా రాహుల్‌కు ఉందని మన్మోహన్ సహా ఇతర సీనియర్లందరూ విశ్వాసం వ్యక్తం చేశారు’ అని సమావేశం అనంతరం ఆంటోనీ తెలిపారు.. దేశ ప్రయోజనాల కోసం పోరాడేందుకు పార్టీ అధినేత, సీడబ్ల్యూసీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని భేటీకి అధ్యక్షత వహించిన రాహుల్ చెప్పినట్టు సమాచారం. రాహుల్ పట్టాభిషేకంపై యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రకటన ఉంటుందా అన్నదానికి ‘మేమూ అదే ఆశిస్తున్నాం’ అని బదులిచ్చారు పార్టీ నాయకుడొకరు. అనారోగ్య కారణాలతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ చరిత్రలో సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా 1998లో సీతారాంకేసరి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2013లో రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. సమావేశ వివరాలను సోనియాకు తెలియజేస్తామని, ఆమె నిర్ణయం వెలువరించిన తరువాత మళ్లీ సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని రణదీప్ వెల్లడించారు. ‘తన వారసుడిని సోనియా నియమించరు. సీడబ్ల్యూసీ నిర్ణరుుస్తుంది’ అని ఆంటోనీ అన్నారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల గడువును మరో ఏడాది పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాలని సీడబ్ల్యూసీ తీర్మానించిందన్నారు.

 చీకటి రోజులు: రాహుల్
 తన ప్రసంగంలో రాహుల్ మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి కారు చీకట్లు కమ్ముకున్నాయని టీవీ చానళ్లపై నిషేధాన్ని ఉద్దేశించి అన్నారు.
 
 ఎన్డీటీవీ ఇండియాపై నిషేధం ఉత్తర్వులు నిలుపుదల
 న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఇండియా చానల్ ప్రసారాలను ఒక్కరోజుపాటు నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నిర్ణరుుంచింది. నిషేధాన్ని పునస్సమీక్షించాలని ఎన్డీటీవీ కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చానల్ అప్పీలును పరిష్కరించే వరకు నిలుపుదల అమలులో ఉంటుంది. ఎన్డీటీవీ కో-చైర్మన్ ప్రణయ్ రాయ్ సోమవారంమంత్రి వెంకయ్య నాయుడును కలసి చర్చించారు. అనంతరం నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు తమపై విధించిన నిషేధం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని ఎన్డీటీవీ ఇండియా చానల్ సుప్రీం కోర్టులో వేసిన  పిటిషన్‌లో ఆరోపించింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి దృశ్యాలను ప్రసారం చేశారంటూ ఈ చానల్‌పై ఒక్కరోజు(నవంబర్ 9) నిషేధం విధించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు