ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ విషబీజాలు

17 Feb, 2014 02:45 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ విషబీజాలు

 ‘తెలంగాణ’పై సంక్షోభమే ఇందుకు నిదర్శనం: మోడీ
 
 సుజాన్‌పూర్ (హిమాచల్‌ప్రదేశ్): ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో విషబీజాలు నాటిందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో నెలకొన్న సంక్షోభమే ఇందుకు చక్కటి నిదర్శనమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మొదలుపెట్టిన కాంగ్రెస్...ఆ నిందను తమపై మోపుతోందని విమర్శించారు. ఆదివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని సుజాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని, అవినీతిని అరికట్టడంతోపాటు విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తేవడంలో ఆ పార్టీ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు.
 మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ప్రజల్లో మేము (బీజేపీ) విష బీజాలు నాటుతున్నామని సోనియాగాంధీ ఆరోపిస్తున్నారు. కానీ ఈ చర్యకు పాల్పడుతున్నది, దీన్ని మొదలుపెట్టింది ఎవరు? అన్నదమ్ములు, రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిందెవరు? పేద, ధనికుల మధ్య తారతమ్యాలు సృష్టించిందెవరు?
 
     ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల విభజన సాఫీగా సాగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లను మేము (బీజేపీ) విభజించినప్పుడు ఆందోళనలు జరగలేదు. మేము విభజన రాజకీయాలు కాదు...ప్రేమతో కూడిన రాజకీయాలు చేస్తాం.
 
     కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు నన్ను పొగిడినందుకు ఆయన్ను తొలగించారు. ఆ రాష్ట్ర మంత్రి ఒకరు నన్ను కలిసినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ సాగించే ఇలాంటి విద్వేషం, అంటరానితనం ప్రజాస్వామ్యానికి మంచిదికాదు.
 
     అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామన్న యూపీఏ ప్రభుత్వం ఆ హామీ నిలబెట్టుకోలేదు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదు. మాకు (బీజేపీ) ఒక అవకాశమిస్తే 60 నెలల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతాం.
 
     దేశంలో అవినీతికి కాంగ్రెస్ పార్టీయే మూలం. కాంగ్రెస్ నేతలు ఒకవేళ అవినీతిపరులు కాకుంటే నల్లధనంపై ఆందోళన ఎందుకు? పేద ప్రజల నుంచి లూటీ చేసిన సొమ్మును వారు విదేశాల్లో దాచుకున్నారు. ఆ సొమ్మును మనం వెనక్కి తెప్పించాలి. ఆ సొమ్మును తెప్పించి ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులకు నజరానాగా ఇస్తాం.
 

మరిన్ని వార్తలు