డీకే శివకుమార్‌ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

24 Nov, 2023 18:33 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. డీకే కేసులో సీబీఐ విచారణ జరిపేందుకు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి(కన్సెంట్‌) అక్రమమని చెప్పారు. తాము ఆ అనుమతిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. 

‘సాధారణంగా సీబీఐ కేసుల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్‌, మంత్రులకు గవర్నర్‌ విచారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీకే కేసులో కేలం గవర్నర్‌ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్‌ పర్మిషన్‌ ఇవ్వలేదు. డీకే ఎమ్మెల్యే కూడా. ఆయనపై సీబీఐ విచారణజరపాలంటే స్పీకర్‌ అనుమతి కావాలి. స్పీకర్‌ అనుమతివ్వనందున సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అక్రమం’ అని సిద్ధరామయ్య తెలిపారు. 

‘అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం మాత్రం అనుమతి ఉపసంహరిస్తుంది. ఆ అనుమతి కేవలం  అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు ఇచ్చింది’ అని సిద్ధరామయ్య అన్నారు. 

2013 నుంచి2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకుగాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్‌ ఇచ్చింది. పబ్లిక్‌ సర్వెంట్‌లను విచారించాలంటే సీబీఐకి ప్రభుత్వ కన్సెంట్‌ తప్పనిసరి. తాను మంత్రిగా ఉన్నప్పటి అక్రమాస్తుల కేసులో కేవలం గవర్నర్‌ మాత్రమే కన్సెంట్‌ ఇచ్చారని, స్పీకర్‌ కన్సెంట్‌ ఇవ్వలేదని పేర్కొంటూ కేసు విచారణను కొట్టి వేయాలని డీకే ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. 

ఇదీచదవండి..చైనా కొత్త వైరస్‌ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ

మరిన్ని వార్తలు