తీరప్రాంతాల్లో ‘అల’జడి!

13 Jun, 2014 23:23 IST|Sakshi
తీరప్రాంతాల్లో ‘అల’జడి!

సాక్షి, ముంబై: కడలి ఉగ్రరూపం దాల్చడంతో ముంబైలోని తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడం, రోజురోజుకు అలల తాకిడి మరింతగా పెరుగుతుండడంతో సముద్ర తీరప్రాంతాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్, వర్లీ, శివాజీ పార్కు, మాహిం తదితర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొస్తోంది. నీటితోపాటు కొట్టుకొస్తున్న చెత్తాచెదారంతో ఈ ప్రాంతాలన్ని డంప్‌యార్డును తలపిస్తున్నాయి.
 
ఇదే పరిస్థితి మరో రెండుమూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఇక్కడి మురికివాడలను ఖాళీ చేయాల్సిందిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్(బీఎసీ) ఆదేశాలు జారీ చేసింది.  శుక్రవారం కూడా నాలుగున్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడడంతో సముద్రపు నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీంతో మెరైన్ డ్రైవ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చౌపాటీ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పానీపూరి, బేల్‌పూరి, శేవ్‌పూరి తదితర తినుబండరాలు విక్రయించే స్టాళ్లన్ని అలలకు చెల్లాచెదురయ్యాయి.
 
ఒకపక్క ఎగిసిపడుతున్న భారీ అలలు, మరోపక్క వేగంగా వీస్తున్న గాలులవల్ల నీరంతా దుకాణాల్లోకి వచ్చేస్తోంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు కూత వేటు దూరంలో ఉన్న తాజ్‌మహల్ హోటల్ ప్రవేశ ద్వారం వరకు సముద్ర పు నీరు చేరడంతో ఆ ప్రాంతమంత చెత్తకుప్పగా మారింది. భారీగా వస్తున్న అలల కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను అనుమతించడం లేదు.
 
శివాజీపార్క్ పరిసరాల్లో ఉన్న స్కౌట్ అండ్ గైడ్ ప్రధాన కార్యాలయం వరకు నీరు వచ్చి చేరింది. కీర్తి కాలేజీ రహదారిపైకి, కాలనీల్లోకి కూడా నీరు రావడంతో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ పాడైపోయాయి.  మాహిం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ముందుజాగ్రత్త చర్యగా హై టైడ్ సమయంలో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణశాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద హోసాలికర్ చెప్పారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద 15 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
 
దాదర్, జుహూ, వర్సోవా, అక్సా బీచ్, గోరాయి తదితర తీర ప్రాంతాలవద్ద అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, జాతీయ విపత్తుల నిర్వహణ సిబ్బంది, బీఎంసీ భద్రతాశాఖ  సిబ్బంది. ఇలా వందలాది మందిని నియమించారు. వీరంతా కోస్టుగార్డు సిబ్బందితో తరుచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.
 
 ‘అల’జడి కొనసాగే సమయం
 తేది    సమయం    అలల ఎత్తు (మీ.లో)
 14 జూన్    మ.12.32    4.60
 15 జూన్    మ.2.03    4.85
 16 జూన్    మ.2.50    4.85
 17 జూన్    మ.3.56    4.74
 18 జూన్    సా. 4.23    4.55

మరిన్ని వార్తలు