ప్రియాంక రోడ్‌షోలో దొంగల చేతివాటం

12 Feb, 2019 11:09 IST|Sakshi

లక్నో : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్‌చార్జ్‌ ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో అట్టహాసంగా నిర్వహించిన రోడ్‌షోలో దొంగలు చేతివాటం చూపారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రచార భేరీ మోగించేందుకు లక్నోలో  తన సోదరుడు ,కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో కలిసి మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చిన రోడ్‌షోలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి పార్టీ కార్యాలయం వరకూ సాగిన ఈ ర్యాలీలో దొంగలు తమ చోరకళను ప్రదర్శించి దాదాపు 50 మందికి పైగా మొబైల్‌ ఫోన్లు, పర్సులను కొట్టేశారు. కాంగ్రెస్‌ ప్రతినిధి జీషన్‌ హైదర్‌ సహా పలువురు పార్టీ నేతల సెల్‌ ఫోన్లు మాయమయ్యాయి. ప్రియాంక ర్యాలీలో పర్సులు, సెల్‌ఫోన్ల అదృశ్యంపై బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని యూపీ పోలీసుల సైబర్‌ సెల్‌ నిపుణుడు వెల్లడించారు.

మరోవైపు మొబైల్‌ చోరీలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తే వారు అతడి నుంచి ఒక ఫోన్‌ కూడా రికవరీ చేయకుండా విడిచిపెట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా మొబైల్‌ ఫోన్లు, వ్యాలెట్ల మాయంపై కాంగ్రెస్‌ నేతలు చివరికి యూపీలోని సరోజిని నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు