మోదీ ఎదుటే మహిళా మంత్రికి లైంగిక వేధింపులు

12 Feb, 2019 11:00 IST|Sakshi

అగర్తాల : మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ ఉండదు. పసికందులు నుంచి ముసలి వాళ్ల వరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు, యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఆడవారిని విలాస వస్తువుగా చూసే సమజాంలో ఎన్ని నిర్భయ చట్టాలు వస్తే మాత్రం ఏం లాభం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి త్రిపురలో చోటు చేసుకుంది. మదమెక్కి కొట్టుకుంటున్న ఓ మంత్రివర్యుడు.. తోటి మహిళా మంత్రిని అసభ్యకర రీతిలో తాకాడు. అది కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలు.. అగర్తాలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు.. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆహార మంత్రిత్వ శాఖ మినిస్టర్‌ మనోజ్‌ కంతి దేబ్‌తో పాటు.. త్రిపుర ఏకైకా మహిళా మంత్రి కూడా వెళ్లారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగా మనోజ్‌.. సదరు మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళా మంత్రి పట్ల మనోజ్‌ తీరును ఎండగడుతున్నాయి ప్రతిపక్షాలు.

‘ప్రధాని, ముఖ్యమంత్రి సమక్షంలో మనోజ్‌ ఓ మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె గౌరవానికి భంగం కలిగించాడు. తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి.. అరెస్ట్‌ చేయాల్సింది’గా డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. ఈ విషయం గురించి మనోజ్‌ను వివరణ కోరగా అతడు స్పందించడానికి నిరాకరించాడు.

మరిన్ని వార్తలు